జలం లేని జలజీవన్‌

May 19,2024 21:00

వీరఘట్టం : ప్రతి గ్రామంలో ఇంటింటికీ తాగునీరందించాలని ఉద్దేశంతో జలజీవన్‌ మిషన్‌ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే అధికారులు, పాలకుల అలసత్వం, గుత్తేదారు నిర్లక్ష్యం వెరసి మండలంలో ఎక్కడా పనులు పూర్తి కాలేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో జలజీవన్‌ మిషన్‌ పనులు మందకోడిగా సాగుతున్నాయి. మండలంలోని 24 సచివాలయాల పరిధిలోని 67 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలని లక్ష్యంతో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 129 పనులకు గానూ సుమారు రూ.22.85 కోట్ల అంచన వ్యయంతో గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గడగమ్మ, యు.వెంకంపేట, చిదిమి, పివిఆర్‌ పురం, డిపి వలస, చే బియ్యంవలస, దశమంతపురం, ఎస్‌.గోపాలపురం, జె.గోపాలపురం, బూరుగ, నడుకూరు, విక్రంపురం, చిట్టిపూడివలస, నడిమికెల్లా, కంబరవలస, చినగోర కాలనీ, బట్టిగూడ, గూడ, కొంచ, కత్తుల కవిటి, హుస్సేన్‌ పురం, బొడ్లపాడు తదితర 67 గ్రామాల్లో 47 పనులకు సంబంధించి రూ.6.37 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ పనులు చేపట్టినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగ అధికారులు చెబుతున్నారు. పైప్‌లైన్లు ఏర్పాటు, బోరు బావుల తవ్వకాలు, ట్యాంకులు నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేవలం బోరు బావులు, పైప్‌లైన్లకు ఇప్పటివరకు రూ.24 లక్షలు బిల్లులు గుత్తేదారులకు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బోరుబావులు, పైప్‌లైన్లకే పనులు పరిమితమయ్యాయి.ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్న బోరు బావులుమండలంలోని యు వెంకంపేట, చిదిమి, బూరుగ, వీరఘట్టం తదితర గ్రామాల్లో బోరు బావులు ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్నాయి. వీటికి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా కుళాయి పాయింట్ల ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామాల్లో చుక్కనీరు రాని కుళాయి పాయింట్లుగా మిగిలాయని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గడగమ్మలో బోరుబావులతో పాటు కుళాయి పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ వీటి ద్వారా చుక్క నీరు రాకపోవడంతో ఈ గ్రామస్తులు నాగావళి నది వద్దకు వెళ్లి చలమల ద్వారా నీరు తోడుకొని దాహార్తిని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జల జీవన్‌ మిషన్‌ పనులు చేపట్టడంతో ఇకపై తాగునీటి కష్టాలు ఉండవని ఎంతో ఆశపడ్డామని, తమ ఆశలపై అధికారులు నీళ్లు చల్లినట్లు అయిందని గడగమ్మ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ ఐదు గ్రామాలకే తాగునీరుమండలంలోని ఎం.రాజపురం, పాపంపేట, సిఎస్‌ఆర్‌ పేట, వండువ, శృంగరాయపురం గ్రామాలకు మాత్రమే పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పైపులైన్లు ఏర్పాటుతో పాటు బోరు బావులు ఏర్పాటు చేసి నీల ట్యాంకులకు అమర్చడంతో గ్రామస్తులకు పూర్తిస్థాయిలో తాగునీరందిస్తున్నట్లు తెలిపారు. వీటికి వండవ రక్షిత మంచినీటి పథకం పైప్లైన్‌ కూడా వీటికి అమర్చారని, ఒకవేళ వండవ రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా నిలిచిపోయినా తాగు నీటి కోసం ఎటువంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు చెబుతున్నారు.ఇంకా పనులు ప్రారంభం కాని గ్రామాలు…మండలంలోని నర్సిపురం, బిటివాడ, ఎంవి పురం, పెద్దూరు, కాగితాడ, కొండవని గోరా , కంబర వలస తదితర గ్రామాల్లో జెజెఎం పనులు ఇంకా ప్రారంభించలేదు. టెండర్లు ఫైనల్‌ కాకపోవడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరందించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీరచ్చేందుకు నిధులు కరువ్వడంతో పాటు అధికారులు కూడా విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా తాగునీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నిధుల కొరత వల్లే పనుల్లో జాప్యంజలజీవన్‌ మిషన్‌ పనులు చేపట్టిందుకు నిధులు కొరత వేధిస్తోంది. ఈ పనులను 2025 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటాం.కెవి ప్రవళ్లిక.ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ.

➡️