సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

May 7,2024 21:58

పార్వతీపురంరూరల్‌ : సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సూక్ష్మ పరిశీలకుల ఓరియంటేషన్‌ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని అన్నారు. ఓటరు తప్పించి పోలింగ్‌ కేంద్రాల్లో ఎవరిని అనుమతించ రాదన్నారు. పోలింగ్‌ జరిగిన చోట ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే ప్రిసైడింగ్‌ అధికారికి, పోలీస్‌ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పోలింగ్‌లో ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనకు ఫోన్‌ ద్వారా సంప్రదించ వచ్చన్నారు. పోలింగ్‌ రోజున మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ ముగింపు అతి ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు 100 మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం చేయడం నిషేధమన్నారు. ఓటరు మాత్రమే ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి రావాలని, ఇతరులు ఎవర్నీ లోపలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. నియమించిన పోలింగ్‌ ఏజెంట్లు ఉదయం 5గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మే 11న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్‌ రోజు ఉదయం గంట5.30లకు ఖచ్చితంగా మాక్‌ పోలింగ్‌ను జనరల్‌ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. ఉదయం 7 గంటల సమయానికి పోలింగ్‌ మొదలు కావాలని, మాక్‌ పోలింగ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రెయికింగ్‌ పోలీస్‌ ఫోర్స్‌నిఘా ఉంటుందన్నారు. సిఆర్‌సి పూర్తయిన వెంటనే పోలింగ్‌ సీల్‌ చేయాలని, మైక్రో అబ్జెర్వర్ల రిపోర్ట్‌ పూర్తి చేయాలని తెలిపారు. మార్క్‌ కాపీ ఆధారంగా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఆఖరి వ్యక్తి ఓటు వేసిన తర్వాత పోలింగ్‌ ముగించాలని తెలిపారు. 12 మే పోలింగ్‌ సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టనుమన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, వీడియో గ్రాఫ్‌ చిత్రీకరణ ఉంటుందని ఎన్నికల పోలింగ్‌ సరళి, నిర్వహణ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. మాక్‌ పోలింగ్‌ నుంచి పోలింగ్‌ ముగింపు వరకు నిర్వహించాల్సిన ప్రక్రియను పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆరుకు పార్లమెంటు సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఎస్‌ శోబిక, ఎన్నికల మైక్రో అబిజర్వర్‌ ల నోడల్‌ అధికారి జె.ఎల్‌.ఎన్‌.మూర్తి, సూక్ష్మ పరిశీలకులు, తదితరులు పాల్గొన్నారు.ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సాధారణ పరిశీలకులుప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌కుమార్‌ మెహర్డ పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌తో కలిసి మంగళవారం సందర్శించారు. ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ఓటర్లకు అందుతున్న సహకారం, జాబితాలో ఓటరు పేరు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేశారు. అక్కడ నుంచి పోలింగ్‌ కేంద్రంలోని పోలింగ్‌ సరళి, బ్యాలెట్‌ పేపర్లు, కవర్లు పంపిణీ, బ్యాలెట్‌ బాక్స్‌ ఏర్పాటును నిశితంగా గమనించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడి వసతుల కల్పనపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్‌ కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వివిధ శాఖల ఉద్యోగులు వినియోగించుకోవాలని పరిశీలకులు అన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు.

➡️