జోరుగా సిపిఎం ఎన్నికల ప్రచారం

Apr 21,2024 22:08

కొమరాడ : కురుపాం నియోజవర్గంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని కురుపాం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మండంగి రమణ అన్నారు. మండలంలోని నాగావళి ఆవతల ఉన్న తొమ్మిది పంచాయతీలు కొట్టు, గుణదతీలేసు, కెమిశీల, తొడుము, పాలెం పంచాయితీల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మిస్తున్న ప్రదేశాన్ని సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రమణ, నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట కేవలం ఓట్లు కోసమే పూర్ణపాడు- లాబేసు వంతెనను పేరును ఉపయోగించుకుం టున్నారు తప్ప వంతెన నిర్మాణం మాత్రం జరగడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి రోజూ అభివృద్ధి అంటున్నారని, ఈ వంతెన పెండింగ్‌ పనులు పూర్తిచేస్తే అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. 14ఏళ్లయినా గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు ఈ వంతెన పెండింగ్‌ పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ వంతెన విషయంలో ఇప్పటికే పలుమార్లు అనేక పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో జరుపుతున్నామని, అనేక కేసులు కూడా నమోదయ్యాయన్నారు. ఈ వంతెన పెండింగ్‌ పనులు కేవలం పోరాటం వల్లే భవిష్యత్తులో పూర్తవుతాయి తప్ప ఇలా ఏ పార్టీ వచ్చినా పూర్తి చేయలేని పరిస్థితి ఉందని, కావున సిపిఎం ఈ వంతెన పూర్తి చేసే వరకు ఏ పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. అలాగే గుమ్మడి గెడ్డ రిజర్వాయర్‌ పూర్తి, గిరిజన గ్రామాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో సిపిఎం ఎల్లవేళలా పోరాటానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈరోజు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, కార్మికుల, రైతాంగం సమస్యలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులుగా కురుపాం అసెంబ్లీకి మండంగి రమణ, అరకు పార్లమెంటరీ స్థానానికి పాచిపెంట అప్పలనర్స పోటీ చేస్తున్నారని, వీరికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించారు. ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి, నాయకులు ఉపేంద్ర, వెంకటేశ, బలరాం పాల్గొన్నారు.ఏజెన్సీలో జోరుగా ఎన్నికల ప్రచారంగుమ్మలక్ష్మీపురం : రానున్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ మద్దతుతో అరకు పార్లమెంటుకు, కురుపాం అసెంబ్లీకి పోటీ చేస్తున్న సిపిఎం ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు పి.అప్పలనర్స, మండంగి రమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌ అభ్యర్థించారు. మండలంలోని రాయగడ జమ్మూ, చాపరాయి బిన్నిడి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రస్తుత పాలక ప్రభుత్వ విధానాలు, గిరిజనుల పట్ల చూపుతున్న నిరంకుశ వైఖరి, అన్యాయాలను గిరిజనులకు వివరించారు. కేంద్రంలోని బిజెపి రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజనుల హక్కులు, చట్టాలను ఉల్లంఘిస్తుందని విమర్శించారు. మరోవైపు కార్పొరేట్‌ శక్తులకు కంపెనీల పేరుతో విచ్చలవిడిగా అనుమతిలిస్తూ అడవి నుంచి గిరిజనులను దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. గిరిజనులకు వెన్నుముకగా ఉన్న జిఒ 3ను రద్దు చేసింన్నారు. అటవీ హక్కుల చట్టం వచ్చి 15 ఏళ్ల దాటినా గిరిజనులకు పూర్తిస్థాయిలో పోడు పట్టాలు మంజూరు చేయలేదన్నారు. గిరిజనులు పండించే జీడి, చింతపండు పంటలకు కనీసం మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గిరిజనుల సమస్యలపై నిత్యం సిపిఎం, గిరిజన సంఘాలు పోరాడుతూనే ఉన్నాయన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కాపాడుకోవాలంటే గిరిజనులకు అండగా ఉండే సిపిఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి చట్టసభలకు పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.మన్మధరావు, ఎం.శంకరరావు, పువ్వల మోహన్‌రావు, ఎం.సన్యాసిరావు, జిల్లా కమిటీ సభ్యులు మండంగి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి పువ్వల తిరుపతిరావు, మండల నాయకులు పువ్వల గవరయ్య, కడ్రక రామస్వామి తదితరులు ఉన్నారు.కురుపాం : మండలంలోని ఊసకొండ పంచాయతీలోని పలు గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. బిజెపి, దాని తొత్తు పొత్తు పార్టీలను ఓడించి సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.అప్పలనరసను, కురుపాం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, నాయకులు ఆరిక మంగయ్య , బిడ్డిక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : మండలంలో పూతిక వలసలో సిపిఎం ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాపు సింహాచలం ఆదివారం ప్రచారం చేపట్టారు సందర్భంగా పొత్తు, తొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి, వైసిపిలను ఓడించి, ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం పార్లమెంటు అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సవర చంటిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గిరిజనులు కోరారు. అనంతరం పూతిక వలసలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఇండియా బ్లాక్‌ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి చంటి బాబుకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం అక్కడ గిరిజనులతో సమావేశమయ్యారు.

➡️