బతుకుదెరువుకు వలసబాట

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వర్షాభావం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, ఆముదం, మిర్చి, కంది, మినుము తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతినడంతో దిగుబడిపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. సాగు చేపట్టేందుకు చేసిన అప్పులు గుదిబండగా మారాయి. వాటిని తీర్చేందుకు మరో మార్గంలేదు. బతుకుదెరువుకు ఉపాధి పనులు ఉపకరిస్తాయనుకుంటే అవి కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలతో పాటు సన్న, చిన్నకారు రైతులు ఊళ్లు వదులుతున్నారు. చంటి బిడ్డలతో సహా మూట ముల్లె సర్దుకొని వలసబాట పడుతున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు గ్రామాల్లోనే గడిపారు. ఎన్నికలు ముగిశాక బతుకుదెరువు వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారు. నియోజకవర్గంలో వలసలు ఇలా.. ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజరవర్గంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాల నుంచి ప్రతియేటా 25 వేల మంది దాకా వలసబాట పడుతుంటారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే సుమారు 30 వేల మంది దాకా వలసబాట పట్టారు. వారంతా ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు నేతలు చార్జీలతో పాటు నజరానా ఇవ్వడంతో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు వచ్చారు. ఓట్లు వేయడం ముగియడంతో ఉపాధి పనులు దొరుకుతాయని చూశారు. అయితే అవి అరకొరగానే ఉన్నాయి. వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కాలేదు. కనీసం వ్యవసాయంలో అరకొర పనులు కూడా జరగడం లేదు. వ్యవసాయ పనులు సాగాలంటే మరో 40 రోజుల నుంచి రెండు నెలలు దాకా పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా గ్రామాల్లో కనీసం కుటుంబాలను పోషించుకునేందుకు పనులు దొరకకపోవడంతో వలసబాట పడుతున్నారు. ప్రతిరోజూ ఒక్కో గ్రామం నుంచి 50 కుటుంబాల దాకా బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాల్లోని పట్టణాల్లో మట్టి పనులు, బేల్దారి పనులు, ఇండ్లలో ఇతర పనులు చేసేందుకు లారీల్లో తరలి వెళుతున్నారు. ఉళ్లో ఉపాధి లేకనే వలసబాట.. ఊళ్లో ఉపాధి లేకనే వలసబాట పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు బాగా పండి దిగుబడి వస్తే ఇ క్కడే పనులు ఉండేవని, చిన్న, సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరికేదని, పంటలు ఎండిపోవటంతో పైర్లను దున్నేసి మూగజీవాలకు మేతగా పదిలేసి వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. రెండు నెలల పాటైనా వలస వెళ్లిన చోట పనులు దొరికితే కొంతమేర కుటుంబ ఖర్చులకైనా వస్తాయని, మరికొంత అప్పులు చెల్లించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా తెలంగాణ, మద్రాసు, పల్నాడు, బెంగుళూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు మట్టి పనులు, చెరువు కోత, వ్యవసాయ పనులు, తాపీ పనులు చేసేందుకు వెళ్తున్నామన్నారు. చంటి పిల్లలను సైతం వెంట తీసుకెళ్తున్నామని తెలిపారు. తిరిగి వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభమై పనులు దొరికేదాకా దూర ప్రాంతాలలో పనులు చూసుకుంటూ జీవనం గడుపుకుంటామని పలువురు పేర్కొన్నారు. తాము ప్రతియేటా ఏడాదిలో ఎనిమిది నెలలు పాటు వలసతోనే జీవనం గడపాల్సి వస్తోందని చెప్పారు.

➡️