సాగర్‌ జలాల విడుదలకు మంత్రి హామీ

Jun 26,2024 22:57

చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు
ప్రజాశక్తి – వినుకొండ :
పల్నాడు జిల్లాలోని తాగునీటి చెరువులను సాగర్‌ జనాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర చెరువును మున్సిపల్‌ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులో నీటిమట్టం తగ్గుతోందని, ఇప్పుడున్న నీరు నెల రోజులకు వస్తాయని చెప్పారు. కృష్ణా రివర్‌ బోర్డుతో మాట్లాడి సాగర్‌ నీటతో త్వరలో చెరువులకు తాగునీరు సరఫరా చేయిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. ఫిల్టర్‌ బెడ్లు శుభ్రంగా లేకపోవడం, లీకేజీ ఉండటం వల్ల కలుషిత నీరు సరఫరా జరుగుతున్నట్లు గుర్తించామని, యుద్ధ ప్రాతిపదికన ఫిల్టర్‌ బెడ్లు శుభ్రం చేసి, లీకేజీ మరమ్మతులు చేపట్టి శుద్ధమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. మరమ్మతుల నిమిత్తం ఒక రోజు నీటి సరఫరా నిలిపేస్తారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారానికి రూ.161 కోట్లు కేంద్రం నుండి తెస్తే ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. 70 శాతం కేంద్రం నిధులిస్తే 30 శాతం రాష్ట్ర వాటా చెల్లిస్తే శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. మూడేళ్లలో వినుకొండ పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెరువుకు వెనుక భాగంలో ఉన్న చెరువును శుభ్రం చేసి, చెరువు మట్టాన్ని పెంచి తాగునీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, 32వ వార్డు కౌన్సిలర్‌ వాసిరెడ్డి లింగమూర్తి, జనసేన నాయకులు ఎన్‌.శ్రీనివాసరావు, నాగశ్రీను రాయల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, డిఇ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

➡️