కారంపూడిలోని నాగులేరునీరు లేక నాగులేరు విలవిల

Apr 20,2024 00:45

ప్రజాశక్తి – కారంపూడి : ఒకవైపు మండుతున్న ఎండలు మరోవైపు ఇంకిపోయిన బుగర్భ జలాలు వెరసి నాగులేరులో చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. నాగులేరు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు నీటి కోసం పాట్లు పడుతున్నారు. పశువులు సైతం నీటి కోసం కటకటలాడుతున్న పరిస్థితి కారంపూడి మండలంలోని నాగులేరు పట్టే గ్రామాల్లో నెలకొంది. దక్షిణ కాశీగా పిలువబడే నాగులేరుకు నీరు విడుదల చేయించి తమ గొంతులు తడపాలని జనం వేడుకుంటున్నారు. ఇటీవల ఎన్‌ఎస్‌పి అధికారులు సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల చేసినా నాలుగులేరుకు విడుదల చేయలేదు. విడుదలకు అవకాశం ఉందన్న అధికారులు ఇప్పుడేమీ స్పందించడం లేదు. గతంలో సాగర్‌ ఆయకట్టకు కింద సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేయడం, లోపల కట్టవెంట సిమెంట్‌ పనులు చేయడంతో నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఉండడంతో సాగర్‌ జలాలు వచ్చినా బోర్లకు నీరు పడడం లేదు. కారంపూడి మండలంలోని కారంపూడి, పేటసన్నేగండ్ల, చింతపల్లి, వేపకంపల్లి, చినగార్లపాడు, పెద్దకొదమగుండ్ల, గాదెవారిపల్లి, దాచేపల్లి మండలంలో పలు గ్రామాలు నాగులేరు పరివాహక గ్రామాలుగా ఉన్నాయి. ఈ గ్రామాలలో ఎక్కడ కూడా ఒకటి, రెండుచోట్ల తప్ప మిగిలిన చోట్ల చెరువులు లేకపోవడంతో ప్రధానంగా ఈ గ్రామాలు నాగులేరునే నమ్ముకొని జీవించవలసిన పరిస్థితి. సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ పక్కనే కారంపూడి – వినుకొండ రోడ్డులో ఎస్‌కెఎఫ్‌ ఛానల్‌ ద్వారా గతంలో నాగులేరుకు నీరు విడుదలయ్యేది. ఎస్‌కెఎఫ్‌ ఛానల్‌ మరమ్మతుకు నోచక ఏళ్లు గడుస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల్లో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. పల్నాటి ఉత్సవాల సందర్బంలో సాగర్‌ మెయిన్‌ కెనాల్‌కు ప్రాక్లేన్‌ ద్వారా చిన్న గండి కొట్టి ఎన్‌ఎస్‌పి అధికారులు నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడదేమీ లేదు. ఇప్పటికైనా విడుదల చేస్తే 15 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుందని, భూగర్భ జలాలూ పెరిగి బోర్లలోనూ నీరొస్తుందని ప్రజలు కోరుతున్నారు.

➡️