కోవిడ్‌ అమర వైద్యుల దినోత్సవం

Jan 30,2024 16:56

కోవిడ్‌ అమర వైద్యులకు నివాళులర్పిస్తున్న ఐఎంఏ సభ్యులు.

కోవిడ్‌ అమర వైద్యుల దినోత్సవం

ప్రజాశక్తి – నంద్యాల
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించే జాతీయ అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం జాతీయ ఐఎంఏ పిలుపుమేరకు నంద్యాలలో కోవిడ్‌ అమర వైద్యుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. స్థానిక మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ వసుధ రాణి, డాక్టర్‌ పనిల్‌ కుమార్‌ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి కోవిడ్‌ అమర వైద్యులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రవికృష్ణ మాట్లాడుతూ కోవిడ్‌ విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సేవలందించే క్రమంలో భాగంగా దేశంలో రెండు వేల మంది, మన రాష్ట్రంలో 122 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వైద్యుల రక్షణ చట్టాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నవంబర్లో రాష్ట్ర ఐఎంఏకు ఇచ్చిన హామీ మేరకు వైద్యులు, ఆసుపత్రుల రాష్ట్ర రక్షణ చట్టంలో సవరణలు చేసి కఠిన తరం చేయాలని, తదనుగుణంగా బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు మధుసూదనరావు, ఐఎంఏ కోశాధికారి డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, వైద్య విధాన పరిషత్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జఫరుల్లా, వైద్యులు పాల్గొన్నారు.లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిలయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిలో భాగంగా జాతీయ అమరవీరుల దినోత్సవం, కోవిడ్‌ అమర వైద్యుల దినోత్సవం నిర్వహించారు. స్థానిక కళారాధన, వికలాంగుల సంఘం, లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో నంద్యాలక్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు పీవీ సుధాకర్‌ రెడ్డి, సోమేశుల నాగరాజుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సీనియర్‌ సభ్యులు కశేట్టి చంద్రశేఖర్‌, ఆంజనేయులు గుప్తా, ఎంపీ వి రమణయ్య, సాయి సందీప్‌, కళారాధన సభ్యులు పాత్రికేయులు పసుపులేటి జనార్ధన్‌, నటుడు శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️