రైతు సంక్షేమమే ధ్యేయం : గంగుల

Jan 2,2024 21:54

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న దృశ్యం

రైతు సంక్షేమమే ధ్యేయం : గంగుల
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
రైతన్నల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర జల వనరుల శాఖ గౌరవ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డిలు అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డ్‌లో మంగళవారం జొన్న పంటకు మద్దతు ధరపై రైతులతో అవగాహన కార్యక్రమం జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు వారాల లోపల రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేదన్నారు. ప్రస్తుతం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వ ఖాతా నుండి 24 గంటల లోపలనే విక్రయించిన రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. గతంలో లాగా జాప్యం ఉండదన్నారు. రైతులు జొన్నల కొనుగోలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జొన్నల కొనుగోలుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా సంబంధిత వ్యవసాయ అధికారులకు, సిబ్బందికి తెలియజేసి పరిష్కారాన్ని పొందాలని రైతులకు సూచించారు. సమస్య తీవ్రంగా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే జొన్న పంటను విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లై డిఎం రాజు, తాసిల్దార్‌ హరినాథ్‌ రావు, డిటి రాజీవ్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గంధం రాఘవరెడ్డి, ఆళ్లగడ్డ, చాగలమర్రి ఎంపిపిలు గజ్జల రాఘవేంద్ర రెడ్డి, వీరభద్రుడు, ఏడిఏ రామ్మోహన్‌ రెడ్డి, ఏవో కిషోర్‌ కుమార్‌ రెడ్డి, దొర్నిపాడు ఏఓ సునీత, మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి నారాయణస్వామి, ప్రవీణ్‌, కౌన్సిలర్‌ గోట్లూరు సుధాకర్‌ రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️