శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Apr 16,2024 16:29

ముచ్చుమర్రిలో పోలీస్‌ కవాతు నిర్వహిస్తున్న ఎస్పి రఘువీరారెడ్డి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
– జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు, ఎస్‌సి రఘువీర్‌ రెడ్డి
– బ్రాహ్మణకొట్కూరు, ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్ల తనిఖీ
ప్రజాశక్తి – పగిడ్యాల
సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని నంద్యాల జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డిలు హెచ్చరించారు. మంగళవారం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో పోలీస్‌ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి పాల్గొని ఎన్నికల్లో ప్రజల భద్రతకు భరోసా కల్పించారు. అనంతరం నందికొట్కూరు రూరల్‌ పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు, ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్లను కలెక్టర్‌, ఎస్‌పిలు ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్లో వివిధ రకాల కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల గురించి స్టేషన్ల పరిధిలో తీసుకున్న చర్యలపై ఎస్‌పి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్లో నమోదయిన కేసులపై వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానంతో త్వరగా విచారణ పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన కాలవ్యవధిలో కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. భూ తగదాలు, పాత గొడవలు, నాటు సారా అమ్ముతున్న అనుమానితులపై బైండోవర్‌ కేసులు పెట్టాలన్నారు. ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని సూచించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. రౌడీ షీటర్ల కదలికపై, వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్‌ డిఎస్‌పి శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్‌ రవీంద్ర, నందికొట్కూరు సిఐలు విజయభాస్కర్‌, ప్రకాష్‌ కుమార్‌, ముచ్చుమర్రి ఎస్సై జయ శేఖర్‌, బ్రాహ్మణకొట్కూర్‌ ఎస్సై నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

➡️