అనుమతుల్లేని ఆస్పత్రులెన్నో…

Apr 13,2024 21:15

private hosptel cartoon

అనుమతుల్లేని ఆస్పత్రులెన్నో…
అధికారుల లెక్కల్లో నంద్యాల జిల్లాలో 196
-అనధికారికంగా మరెన్నో…-
25 ప్రయివేట్‌ ఆసుపత్రులకు వైద్యాధికారులు నోటీసులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
నంద్యాల జిల్లాలో ప్రయివేట్‌ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు జిల్లాస్థాయి రిజిస్ట్రేషన్‌ అథారిటీ, జిల్లా సలహా మండలి సమావేశాలు నిర్వహించి జిల్లాలో ఏఏ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. వేటికి లేవు… వాటి రిజిస్ట్రేషన్‌ చేయించుకోక పోతే వాటి పైన తీసుకోవలసిన చర్యలపైన చర్చలు జరగాలి. ఎపిఎంసిఇ చట్టం 2008, క్లినికల్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ చట్టం, జిఒ నెం. 35, 135 లను అనుసరించి జిల్లాలో అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్స్‌, లాబరేటరీస్‌, ఫిజియోథెరపీ సెంటర్లన్నీ క్లినికల్‌ ఎటాక్ట్‌ ఎపి.జిఒ ఇన్‌వెబ్‌సైలో నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉండగా అలా జరుగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న ఆసుపత్రులు ఐదేళ్లు పూర్తయితే రెన్యువల్‌ చేసుకోవాలసి ఉంది.. కానీ అలా జరుగడం లేదు… రెన్యూవల్‌ సంగతి దేవుడెరుగు… అసలు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం లేదు.. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే జిల్లా కేంద్రంలో పెద్ద పెద్ద భవంతుల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్లు విచ్చల విడిగా నిర్వహిస్తున్నారు.జిల్లాలో 196 ప్రయివేట్‌ ఆసుపత్రులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వారి లెక్కల్లో లేని ఆస్పత్రులు కోకొల్ల్లలుగా ఉన్నాయి. అధికారులు ప్రయివేట్‌ ఆస్పత్రులను తనిఖీ చేసినప్పుడు సరైన పరికరాలు, వసతులు లేవని వాటికీ వివరణ ఇవ్వాలని జిల్లాలో ఇప్పటి వరకు 25 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. వాటికీ ఇంకా ప్రయివేట్‌ యాజమాన్యాల నుండి ఇంతవరకు వివరణ రాలేదని సమాచారం. ఆస్పత్రులలో అడ్రస్‌ లేని ధరల పట్టిక : ప్రయివేటు ఆస్పత్రుల్లో ధరల పట్టిక ప్రదర్శించాలని, ప్రతి చికిత్సను తప్పని సరిగా ఆన్‌లైన్‌ చేయడంతో పాటు ప్రసవాలు, మరణాలు పోర్టల్లో నమోదు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ జరుగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి..చర్యలు శూన్యం.. : రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ లేకుండా నడిపే సంస్థల పట్ల కఠిన చర్యలు తీసుకోవలసిన అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ఆస్పత్రి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.రిజిస్ట్రేషన్‌ లేకుంటే చర్యలు డాక్టర్‌ ఆర్‌. వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, నంద్యాల.నంద్యాలలో ప్రయివేట్‌ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అలా చేయించుకోని ప్రయివేట్‌ ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 26 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాం.. కొన్నిటికి వివరణ వచ్చింది.. మరికొన్ని ఇవ్వాల్సి ఉంది.

➡️