ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

Apr 30,2024 22:17
  • జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బాలాజీ

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ప్రతినిధులు అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ కోరారు.మచిలీపట్నం లోక్‌ సభ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్‌ స్పందన మీటింగ్‌ హాల్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, పోలీస్‌ పరిశీలకులతో కలిసి కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఇందుకు సహకరించిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇదేవిధంగా ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మచిలీపట్నం లోక్‌ సభ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాలకు ఇద్దరు సాధారణ పరిశీలకులు, ముగ్గురు వ్యయ పరిశీలకులు, ఒకరు పోలీస్‌ పరిశీలకులను నియమించిందని అన్నారు. ఈవీఎం రాండమైజేషన్‌ ప్రక్రియ కలెక్టర్‌ వివరిస్తూ ఆయా నియోజకవర్గాలకు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాట్‌ లను కేటాయించడం, ఈవీఎం కమీషనింగ్‌ ప్రక్రియలు జరుగుతాయన్నారు. మే 4న ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రొసైడింగ్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు, మే నెల 5 వ తేదీన ఓపిఓ లకు, మే నెల 6వ తేదీన పోలీస్‌ పర్సనల్‌, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లకు పోస్టల్‌ ఓటింగ్‌ కొరకు ఆయా అసెంబ్లీ హెడ్‌ క్వార్టర్స్‌ లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో పోస్టల్‌ ఓటింగ్‌ కు మిస్సయిన ఓటర్లకు మే 7, 8 తేదీల్లో కూడా వీటిని కొనసాగించనున్నట్లు తెలిపారు. 85 ప్లస్‌, దివ్యాంగులకు హౌమ్‌ ఓటింగ్‌ సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించిందని, మే నెల 2 – 8 తేదీల మధ్య, లెఫ్ట్‌ ఓవర్‌ ఓటర్లకు మే 9, 10 తేదీల్లో హౌమ్‌ ఓటింగ్‌ బృందాలు ఇంటింటికి వెళ్లి హోమ్‌ ఓటింగ్‌ నిర్వహిస్తాయని తెలిపారు. పోలింగ్‌ కౌంటింగ్‌ ముగిశాక 25 నుండి 30 రోజులలోపు ఎన్నికల వ్యయం సరిచూచుటకు సమావేశం నిర్వహిస్తామని, అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయం పై సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, లేనియెడల అనర్హులవుతారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని, క్రిమినల్‌ యాంటిసిడెంట్స్‌ ఒక జాతీయ, ఒక లోకల్‌ పత్రికలతో పాటు ఒక టీవీ ఛానల్‌ లో ప్రకటించవలసి ఉంటుందన్నారు.డిఆర్‌ఓ కే. చంద్రశేఖర రావు మాట్లాడుతూ కలెక్టరేట్లో మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ సెల్‌, వాహన అనుమతులు, ఎన్నికల వ్యయ%శీ%, ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️