ముగిసిన ఎన్నికల ప్రచార హోరు

May 11,2024 21:33

ప్రజాశక్తి – అవనిగడ్డ : ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పోరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ విలువరించిన వెంటనే కొన్ని పార్టీల వారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా మరికొన్ని పార్టీల వారు నామినేషన్ల అనంతరం నామినేషన్ల ఉపసంహరణ నాటి నుండి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీ అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి వచ్చి ఓట్లు అభ్యర్థించే కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు. వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్‌ బాబు సతీమణితో పాటు కుటుంబ సభ్యులు కుమారుడు కుమార్తెలు అల్లుళ్లు ప్రచారంలో పాల్గొనగా టిడిపి బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ తరఫున ఆయన కుమారుడు కుమార్తెలు అల్లుళ్లు బుద్ధ ప్రసాద్‌ సతీమణి కూడా విస్తతంగా పర్యటించి ఓట్ల అభ్యర్థించారు. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కుమారుడు వైసిపి అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు కుమారుడు కూడా తమ తండ్రుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌షోలతో వాటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా భారీ ర్యాలీలతో నియోజక వర్గం అంతా చుట్టుముట్టారు. మరోవైపు సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామ్‌ మూర్తి వామపక్ష నాయకులతో కలిసి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు పోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి వారి మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లు వారికి విజయం చేకూరిస్తే అధికారంలోకి వచ్చి చేపట్టబోయే సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వీరితో పాటు భోజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి గుంటూరు నాగేశ్వరరావు జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి సముద్రాల అంబేద్కర్‌ కూడా పోటీగా ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహించారు మొత్తం 20 రోజులపాటు పోరా హౌరీగా సాగిన ప్రచారం ముగియడంతో ఒక్కసారిగా అవనిగడ్డలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది మరోవైపు తమ అభిమాన అభ్యర్థి పార్టీ గెలుస్తుందంటూ కొందరు పందెం రాయుళ్లు జోరుగా పందాలు కాసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ సారి ఓటర్‌ నాడి ఎటువైపు ఉందో చూడాలి.

➡️