ఓటర్లు నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలి

May 9,2024 21:42
  • రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌ మిశ్రా

ప్రజాశక్తి – కలక్టరేట్‌ (కృష్ణా) : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు, ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్‌ అధికారులు సమిష్టిగా సమన్వయంతో కషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌ మిశ్రా సూచించారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులుగా నియమించిన శ్రీ దీపక్‌ మిశ్రా గురువారం కలెక్టరేట్లో రాష్ట్ర ఇన్స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ జివిజి అశోక్‌ కుమార్‌, మచిలీపట్నం పార్లమెంటు పోలీస్‌ అబ్జర్వర్‌ ప్రసాద్‌ ప్రలాద్‌ అక్కనోరు, మచిలీపట్నం లోక్సభ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలకు సాధారణ పరిశీలకులు జాన్‌ కింగ్స్‌ లే, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు శాసనసభ స్థానాలకు సాధారణ పరిశీలకులు నరహరి సింగ్‌ బంగర్‌, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులు చవాన్‌ ప్రవీణ్‌ మోహన్‌ దాస్‌, గన్నవరం, గుడివాడ, పెడన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులు వికాస్‌ చంద్ర కరోల్‌, జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో స్పందన మీటింగ్‌ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్‌ పరిశీలకులు దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు, అంతరాష్ట్ర సరిహద్దులలో నిఘా ఉంచి ఎన్నికల్లో అక్రమ మద్యం, డబ్బు, ప్రలోభాల రవాణా అరికట్టే చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, పి పద్మావతి, వివిధ ఎన్నికల అంశాల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️