సర్పంచ్‌ భర్త, మరిది కళ్లల్లో కారం కొట్టి దాడి

Apr 5,2024 23:21

చికిత్స పొందుదున్న అంజయ్య
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం సర్పంచ్‌ బత్తుల నాగమ్మ భర్త అంజయ్య, అతని సోదరునిపై శుక్రవారం దాడి జరిగింది. తాము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే తనను చంపేం దుకు సమీప బంధువైన ఉన్నం శ్రీను, అతని సోదరుడు వెంకట్రావు దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం మర్రిచెట్టు పాలెంలో సిమెంట్‌ రోడ్డు వేయకుండా అడ్డుకు న్నారని అన్నారు. తాజాగా గ్రామ అవసరాల దృష్ట్యా హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేయించగా ‘మా స్థలంపై విద్యుత్‌ వైర్లు ఎందుకు లాగారు’ అంటూ సర్పంచ్‌ నాగమ్మ మరిది అయిన బత్తుల చిరంజీవిపై ఉన్నం శ్రీను, ఉన్నం వెంకట్రావు గొడవ పెట్టుకు న్నారని, ఇది తెలిసి తాను అక్కడికి వెళ్లానని, దీంతో తామిద్దరి కళ్లల్లో వారు కారం కొట్టి రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. ఉన్నం శ్రీను, వెంకట్రావు నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించడంతోపాటు దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంజయ్య కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. దాడిపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ కెపి రవీంద్రపాల్‌ చెప్పారు.

➡️