పింఛన్ల కోసం పడిగాపులు

Apr 3,2024 21:27

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందజేశారు. అకౌంట్లకు నగదు ఆలస్యంగా పడినందున పంపిణీలో జాప్యం జరిగిందని సచివాలయ సిబ్బంది తెలిపారు. 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్‌ 4వ తేదీన పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో వచ్చిన ప్రకటన ప్రకారం 3వ తేదీనే అందుతాయని ఆశపడ్డారు. ఇదే ఆశతో ఉదయం నుంచీ వృద్ధులు, వికలాంగులు, ఒంటిరి మహిళలు ఇలా అనేక కేటగిరీలకు చెందిన పింఛను దారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. మండుటెండలో తీవ్ర అవస్థలు పడ్డారు. వేపాడ మండలం సింగరాయి, వల్లంపూడితోపాటు, విజయనగంలోని విటి అగ్రహారం, మెరకముడిదాం మండలం గర్భాం సహా ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. మధ్యాహ్నం వరకు సంబంధిత సచివాలయ అకౌంట్లలో నగదు జమకాలేదు. అనంతరం అకౌంట్లలో జమ అయినట్టు మెసేజ్‌లు రావడంతో సంబంధిత బాధ్యులు హుటాహుటిన బ్యాంకులకు వెళ్లి నగదు తెచ్చారు. అనంతరం లబ్దిదారుల బయోమెట్రిక్‌ తీసుకుని సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేశారు. కేవలం సచివాలయాలలోనే కాకుండా, కొన్నిచోట్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. సమయం సరిపోకపోవడంతో మిగిలిన వారికి రేపు ఇస్తామంటూ చాలా చోట్ల సిబ్బంది చెప్పారు. విజయనగరం జిల్లాలో 2,83,773 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వృద్ధులు 1,47,874 మంది ఉన్నారు. ఆ తరువాత స్థానంలో వితంతువులు 65,971 మంది, వికలాంగులు 37,840మంది, వైఎస్‌ఆర్‌ అభయ హస్తం పింఛనుదారులు 10,848 మంది ఉన్నారు. మిగిలిన వారిలో కళాకారులు, చేనేత, మత్స్యకార, ట్రాన్స్‌ జెండర్‌, దీర్ఘకాలిక రోగులు ఉన్నారు. వీరందరికి నెలనెలా సుమారు రూ.82కోట్ల 93లక్షల 99వేలు జిల్లా గ్రామీణాభివృద్ధి ద్వారా సామాజిక పింఛన్ల కింద అందుతోంది. ఈ మొత్తాన్ని సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పనుల నుంచి వాలంటీర్లను మినహాయించాలని ఎన్నికల సంఘం సూచించిన సంగతి తెలిసిందే. చివరకు న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ పట్ల టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టాలని న్యాయ స్థానం సూచించింది. దీంతో, చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారంటూ సిఎం జగన్‌ సహా వైసిపి నాయకులు విమర్శలు చేశారు. అందుకు తగ్గట్టే రాష్ట్ర స్థాయి అధికారులు మునుపెన్నడూ లేని విధంగా రెండు రోజులు ఆలస్యంగా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. దీంతో, ఆ మేరకు ఆలస్యంగానే పింఛన్ల పంపిణీ మొదలైంది.

వేపాడ మండలంలో చాలా మంది ఉదయం 9 గంటలకే పలుచోట్ల సచివాలయాల వద్దకు చేరుకున్నారు. కార్యాలయం సిబ్బంది 10గంటల తరువాత వచ్చి బ్యాంకు నుంచి అమౌంట్‌ రాలేదని, గురువారం ఇస్తామని చెప్పడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.

విజయనగరంలోని విటి అగ్రహారం సచివాలయంలో వృద్ధులు, వికలాంగులు పింఛను కోసం పడిగాపులు కాశారు. సాయంత్రం సిబ్బంది పింఛను పంపిణీ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెరకముడిదాం మండలంల గర్భాంలో సాయంత్రం నుంచి పింఛను పంపిణీకి చర్యలు చేపట్టగా సర్వర్‌ మొరాయించడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

పింఛన్ల కోసం పడిగాపులు

బొబ్బిలి మున్సిపాలిటీలో 16 సచివాలయాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 6248 మందికి పింఛన్లు అందుతున్నాయి. వీరంతా బుధవారం పింఛన్లు కోసం సచివాలయాలు వద్ద పడిగాపులు కాశారు. యాక్సిస్‌ బ్యాంకులో నగదు విత్‌ డ్రా చేసేందుకు వెళ్లిన సచివాలయ సంక్షేమ కార్యదర్శులు కూడా నగదు కోసం పడిగాపులు కాశారు. బ్యాంకులో నగదు లేకపోవడంతో పింఛన్ల సొమ్ము సచివాలయ ఉద్యోగులకు ఇవ్వలేదు. సాయంత్రం 6గంటల సమయంలో బ్యాంకు అధికారులు పెన్షన్‌ సొమ్ము ఇవ్వడంతో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు.

➡️