ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

ప్రజాశక్తి-కడప ఎన్నికల ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలులో సాధారణ ఎన్నికల దష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జెసి గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. నాయకుల ర్యాలీలు, స్టార్‌ క్యాంపెయిన్‌, రోడ్‌షో లాంటి కార్యక్రమాల కోసం 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. డోర్‌ టూ డోర్‌ ప్రచారానికి కూడా పర్మిషన్‌ తప్పక తీసుకోవాలన్నారు. ఎంసిసిపై రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పించామన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రత్యక్ష ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారించి చర్యలు చేపడతామని తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల పోలింగ్‌ వరకు కూడా ఫార్మ్‌-6 అభ్యర్థనలు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాలో 15 వేల మందికిపైగా విధులను కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, హెచ్‌ఆర్‌ పాలసీ నియామక ఉద్యోగులకు మాత్రమే విధులను కేటాయించామని తెలిపారు. మహిళలకు ఎన్నికల విధుల కేటాయింపులో నియోజకవర్గ పరిధిలోని వారికి డ్యూటీలను అలాట్‌ చేస్తామన్నారు. ఇవిఎంల పరంగా లెక్క ప్రకారం జిల్లాకు సరిపడా మేర సిద్ధంగా ఉన్నాయన్నారు. 14, 15వ తేదీన మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను చేపడతామని చెప్పారు. ఈ నెల 13, 14వ తేదీల్లో పిఒ, ఎపిఒలకు మొదటి విడతలో, మే నెలలో రెండవ విడతలో శిక్షణ ఇస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే అడ్వర్టైజ్మెంట్స్‌లకు సంబంధించిన రేటింగ్‌ కార్డు ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు పర్మిషన్‌ తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా అధికారులు కానీ, పార్టీల ప్రతినిధులు కానీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నట్లు మీ దష్టికి వస్తే సి.విజిల్‌ యాప్‌ ద్వారా, లేదా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 లేదా కాల్‌ చేసి తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎం.ప్రతాప్‌ రెడ్డి (టిడిపి), కానుగ దానం (బిఎస్‌పి), జి.లక్ష్మణ్‌రావు (బిజెపి), బి.పాల్‌ సుధాకర్‌ (కాంగ్రెస్‌), ఎం.భరత్‌రెడ్డి (వైసిపి), డాక్టర్‌ బి.శ్రీనివాసులు (ఆప్‌), మనోహర్‌ (సిపిఎం) తదితరులతో పాటు సంబందిత ఎన్నికల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి విజరు రామరాజు

➡️