పోలింగ్‌ ప్రశాంతం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో సోమవారం ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని యర్రగొండపాలెం మండలం నరసాయిపాలెంంలో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య మాటలు పెరిగి పోలింగ్‌ నిలిచిపోయింది. యర్రగొండపాలెంలోని 33వ పోలింగ్‌ బూత్‌, 21వ బూత్‌, వీరభద్రాపురంలోని 6వ బూత్‌, పుల్లలచెరువు మండలం నాయుడుపాలెంలో 78వ బూత్‌, చాపలమడుగులో 80వ బూత్‌, ఆర్‌ ఉమ్మడివరంలో 62వ బూత్‌, త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెంలో 135వ బూత్‌, శ్రీనివాస్‌ నగర్‌లో ఉన్న 153వ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో గంట నుంచి రెండు గంటల దాకా ఎన్నికల ప్రక్రియ నిలిచింది. తర్వాత తిరిగి ఈవీఎంలు పని చేశాయి. పుల్లలచెరువు మండలంలోని శతకోడు, ముటుకుల, నరజాముల తండా, యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం, నరసాయిపాలెం గ్రామాలలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌కు ప్రజలు ఆరు గంటలు నుంచే బారులు తీరారు. పోలింగ్‌ ఏడు గంటలకు ప్రారంభమైంది. ఉదయం బారులు తీరిన ప్రజలు మధ్యాహ్నం ఎండవేడికి బూత్‌ల వద్ద అంతగా కనిపించలేదు. సాయంత్రం 3 గంటలు తర్వాత మళ్లీ ప్రజలు బారులుతీరి కనిపిపించారు. ఓటు వేయించేందుకు వృద్ధులను సైతం యువకులు మోసుకుంటూ తీసుకొచ్చారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,07,214 మంది కాగా ఉదయం తొమ్మిది గంటలకు 8.52 శాతం ఓట్లు పోలయ్యాయి. 11 గంటలకు 21.55 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 36.83 శాతం, మూడు గంటలకు 49.03 శాతం, సాయంత్రం ఐదు గంటలకు 67.52 శాతం, ఆరు గంటలకు 72.79 శాతం పోలయ్యాయి. కాగా ఇంకా పలు గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్‌లలో ఉండడంతో రాత్రి తొమ్మిది నుంచి పది గంటలు వరకు పోలింగ్‌ జరగనుంది.

➡️