పదవులు, పోస్టుల కోసం పోటీ

Jun 18,2024 23:17

ప్రజాశక్తి – చిలకలూరిపేట : టిడిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులపై టిడిపి నాయకుల ఆశలు పెరుగుతున్నాయి. వీటితోపాటు రేషన్‌ డీలర్‌షిప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల కోసమూ గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఐదేళ్లుగా తాము ప్రభుత్వ కార్యాలయాల మెట్లు కూడా ఎక్కలేకపోయామని, వైసిపివారే అంతా అనుభవించారని, ప్రస్తుతం టిడిపి అధికారంలో ఉన్నందున ప్రభుత్వ పరంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిచేకూర్చేందుకు వీలున్న పదవులు, పోస్టులు చిన్నవైనా, పెద్దవైనా సత్వరమే తమకు దక్కలాని గట్టిగా అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో 150 నుంచి 170 వరకు, మండల స్థాయిలో 40-60 వరకు వివిధ రకాల పోస్టులు ఉన్నట్లు టిడిపి శ్రేణులు క్షేత్రస్థాయిల్లో లెక్కలేసుకుని తమకు ఏ పదవులు కావాలో నిర్ణయించుకుంటున్నారు. మరోవైపు ఒక రేషన్‌ షాపులోని కార్డులను విభజించి రెండు, మూడు షాపులుగా వేరుచేసి వాటిని ఎక్కువ మంది కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నాలూ సాగుతున్నాయి. డీలర్‌షిప్‌ కలిగి ఉన్న వైసిపికి చెందిన వారు రాజీనామాలు చేస్తున్నట్లు తెలిసింది. రేషన్‌ డీలర్‌షిప్‌నకు ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. ఎక్కువ మంది నాయకులు వీటి కోసం పట్టుబడుతున్నారు. ఉపాధి హామీ పనులను చేయించే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసమూ ఇదే పోటీ నెలకొంది.పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని ఆ పార్టీ నిర్ణయించిన క్రమంలో గ్రామాల వారీగా సమాచారాన్ని ఎమ్మెల్యే పుల్లారావు ఇప్పటికే సేకరించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆయా పోస్టుల్లో ఉన్నవారు ఇప్పుడు వైదొలగాల్సి వస్తే తమ జీవనోపాధి పోతుందని, తమ కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయని వారు ఆందోళనలో ఉన్నారు. అయితే పార్టీ కోసం కష్టాలు పడి, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి, కొన్ని సందర్భాల్లో తన్నులూ తిన్న తమకు ఇప్పుడైనా కావాల్సినవి దక్కకుంటే ఎలా? అని మరికొందరు కార్యకర్తలు అంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీసైతం గుర్తించే అలాంటి వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించి ందని చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో పదువులు, పోస్టులకు పోటీ తీవ్రంగానే నడుస్తోంది.

➡️