6 శాతానికి దిగజారిన పేదరికం

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో 12 శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరుశాతానికి దిగజారిందని, ఇది జనగ్‌మోహన్‌రెడ్డి సాధించిన ఘనత అని రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర ఒంగోలు వచ్చిన సందర్భంగా బుధవారం స్ధానికంగా ఓ ప్రయివేటు హౌటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నీ రకాల పథకాలలో తగిన ప్రాధాన్యత ఇచ్చి వారు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు పాటుపడుతున్న సామాజిక విప్లవకారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. ఆంగ్ల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పిల్లల భవిష్యత్తుకు గట్టి పునాదిని నిర్మిస్తోందని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో అనేక సామాజిక సంస్కరణలు అమలు చేసి అన్ని రంగాల్లో సాధికారిత సాధించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి రెండో విడతలో మంత్రి పదవి ఇవ్వకుండా దళితుడినైన తనకు మంత్రి పదవి ఇచ్చి సామాజిక సాధికారితకు జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి దళితుల పక్షాన నిలిచారని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన విధంగా మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ రకాల వాగ్ధానాలను నవరత్నాలు పధకాల ద్వారా ప్రజలకు అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో బీసీలలో ఉండే ప్రధాన కులాలకు ఆరామక్షేత్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. తాము ఒంగోలులో పంపిణీ చేయబోయే ఇళ్ల పట్టాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే అధికంగా ఉన్నారని తెలిపారు. విలేకర్ల సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంల్‌సిలు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, డైరెక్టర్‌లు పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులతో నోవాసిస్‌ హౌటల్‌లో వైసిపి ఐదు జిల్లాల కో ఆర్డినేటర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. సామాజిక సాధికార బస్సు యాత్రపై, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించారు.

➡️