ప్రొద్దుటూరు మల్లయుద్ధం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిప్రొద్దుటూరు బరిలో నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసిపి తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, టిడిపి తరుపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వరదరాజులరెడ్డి, కాంగ్రెస్‌ తరుపున షేక్‌ పూలనజీర్‌ నిలిచారు. వీరిద్ధరు ఒకప్పటి గురుశిష్యులు కావడం ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. వైసిపి అభ్యర్థి రాచమల్లు పార్టీ సంస్థాగత బలం, బలగంతోపాటు మహిళా ఓటర్లలో సానుకూలత ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వరదరాజులరెడ్డిని ఢకొీనడం తలకు మించిన ప్రాణం చందంగా మారింది. వాలంటీర్లు, గృహసారధులు, వైసిపి కార్యకర్తల సహాయంతో సీనియర్‌ నాయకులైన ఎన్‌.వరదరాజులరెడ్డితో ముఖాముఖి తలపడుతున్న నేపథ్యం రాయలసీమలోనే ఆసక్తికరమైన పోటీని తలపిస్తోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2.20 లక్షలు ఓటర్లు ఉన్నారు. ప్రొద్దుటూరు అర్బన్‌, రాజుపాలెం మండలాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో పెద్దసంఖ్యలో అర్బన్‌ ఓటర్లు ఉన్నారు. రాజుపాలెం మండలం గత ఎన్నిక మినహా సహజంగా టిడిపి ఆధిక్యత కలిగిన ప్రాంతం కావడం, అర్బన్‌లో వైశ్య సామాజికవర్గంలో సానుకూలత ఉండడం టిడిపికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు వైసిపి అభ్యర్థికి కొత్తపల్లి పంచాయతీలో తటస్థత, సోములవారిపల్లి, గోపవరం మండలాల్లో సానుకూలత లభించే అవకాశం కనిపిస్తోంది. వైసిపి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాల దన్నుతో ముందుకు సాగుతుండడంతో అసెంబ్లీ ఎన్నిక క్లిష్టమైన పోటీని తలపిస్తోంది.సోషల్‌ ఇంజినీరింగ్‌పైనే దృష్టి వైసిపి సోషల్‌ ఇంజినీరింగ్‌పై ఆధారపడి ఎన్నికల యుద్ధానికి శ్రీకారం చుట్టింది. వైసిపి అభ్యర్థి రాచమల్లు ఆయా సామాజికవర్గాల ఓటర్ల వారీ లెక్కల ఆధారం చేసుకుని గెలుస్తామనే ఆశలు పెంచుకున్నారు. వైసిపి సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాల దన్నుతో పేదప్రజల ఓట్లను నమ్ముకుని ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ తరహాలో రూరల్‌ ప్రాంతాల్లో పట్టు కలిగిన పార్టీ అధికారంలోకి వచ్చిన తీరు నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అభ్యర్థి ఎన్‌.వరదరాజులరెడ్డి అర్బన్‌ ఓటర్లు, కూటమి ఓటర్ల అండతో గెలుస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. టిడిపి, జనసే, బిజెపితో కూటమి కట్టిన నేపథ్యంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటర్లు గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఫిరాయింపుల్లో పోటాపోటీ! వైసిపి అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మధ్య అసమ్మతి పతాకస్థాయికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ ఎమ్మెల్యేతో విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్‌ ఇడుపులపాయ నుంచి తలపెట్టిన బస్సుయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో రాజుపాలెం ఎంపిపి ప్రభాకర్‌రెడ్డికి వైసిపి తీర్థం ఇప్పించడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. ఇటీవలి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన సందర్బంగా టిడిపి అభ్యర్థి ఎన్‌.వరదరాజులరెడ్డి వైసిపి అసమ్మతిన నాయకులైన కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి టిడిపి తీర్థం ఇప్పించారు. ఏదే మైనప్పటికీ వైసిపి, టిడిపి అభ్యర్థులు ఫిరాయింపుల అంశంలో ఢ అంటే ఢ అనే పరిస్థితి నెలకొంది.మైనార్టీ ఓట్లే కీలకమా! ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. మైనార్టీ ఓటర్లలో గణనీయమైన సంఖ్యలో ముస్లిములు, క్రిస్టియన్లు ఉన్నారు. వైసిపి మైనార్టీ ఓటర్లపై ఆశలు పెంచుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థికి 2,300 ఓట్లు లభించడం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైనార్టీ ఓటర్ల మొగ్గు కాంగ్రెస్‌ వైపు కనిపిస్తున్న నేపథ్యం పోటీని క్లిష్టంగా మార్చింది. టిడిపి, బిజెపితో కూటమి కట్టిన నేపథ్యంలో మైనార్టీ ఓట్లు వైసిపి, కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మైనార్టీ ఓట్లను కాంగ్రెస్‌ ఏమేరకు గండికొడుతుందనే అంశాన్ని బట్టి వైసిపి, టిడిపి అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.

➡️