శాంటా క్లాజ్ కి వినతిపత్రం అందజేసి సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

Dec 25,2023 15:12 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : బైబిల్ అంత పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీని జగన్ అమలు చేసేలా మంచి బుద్ధిని ప్రసాదించమని క్రిస్మస్ సందర్భంగా ఇంద్ర పాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శాంతా క్లాస్ కి వినతిపత్రం అందించి మతాలకతీతంగా సమగ్రశిక్షా ఉద్యోగులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం.చంటిబాబు మాట్లాడుతూ.. మతాలకు ఖురాన్, బైబిలు, భగవద్గీత ఎంత పవిత్రమైనవో, రాజకీయ నాయకులకు అసెంబ్లీ అంత పవిత్రమైనదని, అంతటి పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానని జగన్ హామీఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక మాటతప్పాడని విమర్శించారు. 12 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగాలనే నమ్ముకుని పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులకు గత్యంతరం లేని పరిస్థితిలో కుటుంబాల పోషణ భారంగా మారడంతో, ఇచ్చే జీతాలు ఏమాత్రం సరిపోకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమన్నారు. వాచ్మెన్ నుండి టీచర్ల వరకు ఎనిమిది రకాల కేటగిరిలలో పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇదే తరహా పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనాలను చెల్లించాలని 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమంటుంటే జగన్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ 8 నుండి 18 వేల లోపు మాత్రమే చెల్లిస్తూ ఉద్యోగుల శ్రమను దోచుకుంటుందని, తక్షణం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని రెగ్యులర్ చేయాలని అప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిబిరానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నగేష్, చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, పివివి రమణలు మద్దతు తెలియజేసారు. జేఏసీ జిల్లా కార్యదర్శి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్, రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు.

➡️