ప్రశ్నార్థకం!

జిల్లా జ్వరాల బారిన పడింది. జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రోజురోజుకూ జ్వరతీవ్రత పెచ్చరిల్లుతోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులనే తేడా లేకుండా శారీరక, మానసిక, ఆర్థిక అనారోగ్యం బారినపడి విలవిల్లాడుతున్నారు. ఫలితంగా సమాజ ఆర్థిక జీవనాడులు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలానికి చెందిన ఓ మెడికో విద్యార్థిని డెంగీ జ్వరం బారిన పడి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆమె బెంగళూరులో డెంగీ బారిన పడినప్పటికీ, బెంగళూరు, కడప జిల్లాలో జ్వరాల విజృంభణకు తేడా లేదనే సంగతిని గ్రహించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వరాల తీవ్రతను పరిశీలిస్తే 100 డెంగీ, 24 మలేరియా కేసులు నమోదు కావడం జ్వరాల తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరగడం, తాగునీరు కలుషితం కావడానికి అవకాశం ఉంది. జ్వరాల తీవ్రత మరింత పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉందని చెప్ప వచ్చు వేసవి సీజన్‌ నుంచి వర్షపు సీజన్‌లోకి మారడంతో వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లు జీవం సంతరించుకుని జ్వరాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. డిఎంహెచ్‌ఒ, సిహెచ్‌సి వైద్య కేంద్రాలు, పారిశుధ్యం, తాగునీటి కలుషితం నివారణకు దృష్టి సారించాల్సి ఉంది. సదరు వైద్య ఆరోగ్య, పారిశుధ్య, తాగునీటి సరఫరా విభాగాలు జ్వరాలకు సున్నిత కేంద్రాలు, అతిసున్నిత కేంద్రాలను గుర్తించి, జ్వరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. దోమల గుడ్లు, లార్వాల వృద్ధి నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కట్టుదిట్టమైన చర్యల స్థానంలో మొక్కుబడి తనానికి అలవాటు పడితే దారినపోయే పెను ప్రమాదాన్ని ఇంట్లోకి ఆహ్వానించి నట్లు అవుతుందని గ్రహించాలి. ప్రజారోగ్య పరిరక్షణ పట్ల నెలకొన్న నిర్లక్ష్యాన్ని జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించాలి. పదేళ్ల కిందట ఉమ్మడి జిల్లా డెంగ్యూ బారిన పడిన సమయంలో పలువురు రోగులు తిరుపతి, కర్నూలు, చెన్నరు, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలకు పరుగులు తీసిన సంగతి గుర్తుకువస్తోంది. ఫలితంగా లక్షలాది రూపాయలు కోల్పోవడం తెలిసిందే. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 72 పిహెచ్‌సి, 16 సిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రి, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో డెంగ్యూ ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయ లేమి కారణంగా నగరాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం ఉన్నప్పటికీ వైద్యుల్లో చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారింది. వీరికితోడు నర్సుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించని రోగులు సైతం ప్రయివేటు ఆస్పత్రులకు వేలాది రూపాయలు కొల్లబెడుతున్న దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ జిల్లా వాసి కావడంతో జ్వరాల తీవ్రతపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉరుముతోంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️