ఏజెన్సీలో పలుచోట్ల వర్షం

Apr 20,2024 21:23

ప్రజాశక్తి – మక్కువ: పార్వతీపురం రూరల్‌ ఏజెన్సీలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత నెలరోజులుగా ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. కొమరాడ మండలం ఎండభద్ర, పూడేసు, మసిమండ తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఉపశమనం పొందారు. మక్కువ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. 44 డిగ్రీలపైబడి ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో కురిసిన వాన కొంతమేరకు వేడిని చల్లార్చింది. పార్వతీపురం టౌన్‌ : గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికంగా నమోదు కావడంతో ఎండ వేడిమికి తాళలేక పట్టణ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. మండలంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడడడంతో ప్రజలు ఊరట చెందారు. మండలంలోని గోచెక్క, డోకిశీల, తాళ్లబురిడి, లచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో అక్కడక్కడ చినుకులు పడ్డాయి. పార్వతీపురం పరిసర గ్రామాల్లో పెద్దగా చినుకులు లేకపోయినా వాతావరణం మబ్బు పట్టి చల్లగాలులు వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

➡️