ఖచ్చితంగా నివేదికలు అందజేయాలి

May 12,2024 21:23

ప్రజాశక్తి-విజయనగరం కోట, టౌన్‌: పోలింగ్‌ రోజు ఇచ్చే నివేదికలను ఖచ్చితమైన వివరాలతో, వేగంగా అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రోజు మేనేజ్‌మెంట్‌ వ్యవస్థపై ఆదివారం రాత్రి సమీక్షించారు. అక్కడి అధికారులు, సిబ్బంది ఎన్నికల రోజు చేయాల్సిన విధులు, పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ఆదివారం రాత్రికే అన్ని పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయించాలని సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద ఓటర్‌ గుర్తింపు కార్డులకు సంబంధించి, ఎలా ఓటు చేయాలి తదితర వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ రోజు ఇచ్చే నివేదికలు ఎంతో కీలకమని, ఖచ్చితమైన సమాచారంతో వేగంగా వాటిని రూపొందించి అందజేయాలని సూచించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోల్‌ జరిగేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. మాక్‌ పోల్‌ పూర్తి అయినట్లు అన్ని పోలింగ్‌ కేంద్రాలనుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉదయం 7 గంటలకే అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ ప్రారంభం అయినట్లు కూడా రిపోర్టులు తెప్పించాలని చెప్పారు. ఉదయం 9 గంటలు నుంచీ ప్రతీ 2 గంటలకు ఓటింగ్‌ శాతాన్ని తీసుకోవాలని, పోలింగ్‌ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఈ వివరాలు అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, ఎన్నికల రోజు మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఇన్‌ఛార్జి, డిప్యుటీ సిఇఒ కె.రాజ్‌కుమార్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.వెబ్‌ కాస్టింగ్‌ను పరిశీలించిన కలెక్టర్‌ వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఆదివారం రాత్రి కంట్రోల్‌ రూమును ఆమె సందర్శించారు. జిల్లాలోని 362 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలతో సహా మొత్తం 1136 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. దీనికోసం 2272 సిసి కెమేరాలను అమ ర్చారు. వీటి ద్వారా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ ప్రక్రియను కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే పరిశీలిం చనున్నారు. కంట్రోల్‌ రూములో నియోజకవర్గాల వారీగా వెబ్‌ కాస్టింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ఏడు టివిల్లో, పోలింగ్‌ బూత్‌ల కార్యకలాపాలను కలెక్టర్‌ తిలకించారు. పోలింగ్‌ రోజు ఎక్కడా ఎటువంటి సాంకేతిక సమస్యా తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

➡️