కూటమి విష ప్రచారాన్ని తిప్పికొట్టండి

Apr 11,2024 21:21

జగన్‌ చేసిన మంచినే వివరించండి

ఎన్నికలకు 30 రోజులే కీలకం

వైసిపి విస్తృత సమావేశంలో సుబ్బారెడ్డి, బొత్స

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్‌డిఎ కూటమి విష ప్రచారాన్ని తిప్పికొట్టి జగన్‌ చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైసిపి ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం గుఉవారం నగరంలోని జగన్నాధ ఫంక్షన్‌ హాలులో జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే 175 నియోజకవర్గాల్లో విజయాన్ని అందిస్తాయన్నారు. రానున్న 10 రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారపు. రానున్న 30 రోజులు కీలకమైనవని, ప్రతి ఇంటికి వెళ్లి వైసిపికి ఓటు వేయాలని కోరాలని సూచించారు. కూటమి నాయకులు వాలంటీర్లు, పెన్షన్‌దారులపై దాడి చేస్తున్నారని, వారి ఓట్లు మనకు పడకుండా కుట్ర పన్నుతున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి కుట్రలను వివరించాలన్నారు. పోలింగ్‌ బూత్‌ ల్లో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చాలా కీలకమని, ఓటర్లను గుర్తించి మన పార్టీకి ఓటు వేసేలా చూడాలని కోరారు. సచివాలయం వారీగా బాధ్యత తీసుకొని పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మళ్లీ గౌరవం పొందుతామని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న మనస్పర్థలు (మిగతా..3లో)ఉంటే వాటిని పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వాల్సిన గౌరవం, పదవులు వచ్చే ఐదేళ్లలో ఇస్తామన్నారు. మీరు కష్టపడితేనే మళ్లీ మనం అధికారంలోకి వస్తామని, మనపై మీద వచ్చే వ్యతిరేక వార్తలు, ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా మన ప్రచారం పెంచాలని కోరారు. చంద్రబాబు హయాంలో కూటమి దోపిడీ, దౌర్జన్యలను వివరించాలన్నారు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీలేక వైసిపిపై బురద జల్లుతున్నారన్నారు. ఆయనలాగా జగన్‌ పేజీలు పేజీలు మేనిఫెస్టో హామీలు ఇవ్వలేరని, ఇచ్చిన మాటను, హామీని నెలబెట్టుకొని ఓటు అడుగుతున్నామని అన్నారు. బిజెపి అధ్యక్షురాలు పురందీశ్వరి ఐఎఎస్‌, ఐపిఎస్‌లపై లెటర్లు రాస్తున్నారని, హెరిటేజ్‌ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా అని ప్రశ్నించారు. ఇవేమి పట్టించుకోకుండా కష్టపడి పని చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ప్రజలు మన వెంట ఉన్నారని, కార్యకర్తలు వారిని ఓటింగ్‌ వేయడానికి వచ్చే విధంగా చైతన్యం తీసుకొని రావాలన్నారు. అనంతరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️