క్వింటాకి 10 వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి

Dec 9,2023 16:51 #Kurnool
10 వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పత్తి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి పదివేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డులో పత్తి రైతుల జిల్లా సదస్సు రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్ అధ్యక్షతన మార్కెట్ యార్డ్ సమావేశం జరిపించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు,ఆదోని అభివృద్ధి వేదిక నాయకులు ఆదినారాయణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.పరమేష్ మాట్లాడుతూ పత్తి పంటకు క్వింటాల్ కి 10వేల రూపాయలు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని,స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు పత్తి పంటకు కనీసం మద్దతు ధరC2+50 శాతం ప్రకారం నిర్ణయించి అమలు చేయాలనీ, పత్తి పంటకు క్వింటాల్ కి 2000 రూపాయలు బోనస్ గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని, సీసీఐ ద్వారా పత్తి పంటను కొనుగోలు చేయాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.రాష్ట్రంలో దాదాపు 6 లక్షల హెక్టర్ల వరకు పత్తి పంటను రైతులు సాగు చేస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 లక్షల హెక్టార్లకు పైగా ప్రత్తి పంటను సాగు చేస్తున్నారని వారన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 6 – 7వేలుకు మించి ధర దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే పద్ధతిలో పత్తి ధరలు కొనసాగితే భవిష్యత్తులో పత్తి సాగు తగ్గే అవకాశం ఎక్కువ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తికి కనీసం క్వింటాల్ కి 10 వేల రూపాయలు గిట్టుబాటు ధర కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో రైతు సంఘం మండల కార్యదర్శి బి.అయ్యప్ప, రైతు సంఘం జిల్లా నాయకులు ఈరన్న,రైతు సంఘం మండల నాయకులు చిన్నతిక్కన్న,హనుమంతు రెడ్డి, ఏలియా,రంగనాథ్,మండల నాయకులు రహిమాన్,రైతులు పాల్గొన్నారు.

➡️