కాంగ్రెస్‌ గెలుపుతోనే ప్రత్యేక హోదా

May 2,2024 20:55

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ప్రత్యేక హోదాకు సహకరించాలని నెల్లిమర్ల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి సరగడ రమేష్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారంలో కోరారు. గురువారం జరజాపుపేటలో సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావుతో కలసి రమేష్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని సార్వత్రిక ఎన్నికల్లో ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. గత పది సంవత్సరాలుగా బిజెపి, వైసిపి, టిడిపి రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదా విషయంలో మభ్య పెట్టి మోసం చేశాయని, రాష్ట్రానికి ఈ పార్టీల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సరికదా టిడిపిి, వైసిపి, ప్రస్తుత జనసేన పార్టీలు మోడి సేవలో తేలుతున్నాయని చెప్పారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కనకల పద్మ నాభం తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టి, కార్పొరేట్‌ సంస్థల కోసం పనిచేస్తున్న బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి మరిపి విద్యాసాగర్‌ తెలిపారు. మండలంలోని రంగపువలస, పెరుమాలి, గోపాలవలస గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం బిజెపి పనిచేస్తోందని తెలిపారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించి, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, మళ్లీ గద్దెనెక్కాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బిజెపి ముక్త భారత్‌ అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాస రావు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు పత్రి రాజు, పొందూరు రవీంద్ర, రాజా అప్పలనాయుడు, రాంబార్కి రామకృష్ణ, కిలారి చిన్న, రాయి రామారావు, భరత్‌ పాల్గొన్నారు. జామి, శృంగవరపుకోట: ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకొని, బిజెపి ముప్పు నుంచి దేశాన్ని కాపాడాలని, రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుగా నిలవాలని శృంగవరపుకోట కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ గేదెల తిరుపతి పిలుపునిచ్చారు. గురువారం జామి నాలుగు రోడ్ల జంక్షన్‌లో, ఎస్‌.కోట పట్టణంలోని మెయిన్‌ రోడ్డు, కాపు వీధి, బ్రాహ్మణ వీధిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. వ్యాపార సముదాయాల్లో పర్యటించి, హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జామి బస్టాండ్‌ వద్ద ఆయన డప్పు కొడుతూ ప్రచారం నిర్వహించి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జామి మండల అధ్యక్షులు బోని అప్పారావు, సీనియర్‌ నాయకులు మణిబాబు, నానాజీ, భద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️