ఇష్టపడి చదివితే లక్ష్యం సాధ్యం

ఇష్టపడి చదివితే లక్ష్యం సాధ్యం

డిప్యూటీ కలెక్టర్‌ స్వాతిని సన్మానిస్తున్న అధ్యాపకులు

     హిందూపురం : విద్యార్థులు ఇష్టంతో చదివితే లక్ష్యం సాధించడం తథ్యం అని గుంటూరు జిల్లా డిప్యూటి కలెక్టర్‌ స్వాతి అన్నారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌పిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన స్వాతి గత సంవత్సరం నిర్వహించిన యూపిఎస్‌సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, డిప్యూటి కలెక్టర్‌గా ఎంపిక అయింది. ఆమెను గురువారం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రగతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి కలెక్టర్‌ స్వాతి మాట్లాడుతు విద్యార్థులు ఒక లక్ష్యంతో చదవాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానన్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రగతి మాట్లాడుతు స్వాతిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీధర్‌, తిరుమలమ్మ, శ్రీలక్ష్మి, వెంకటేష్‌, పోలప్ప, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పరిగి : తాను విద్యార్థి దశలో పదవ తరగతి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత అయిన సందర్భంలో పరిగిలో తహశీల్దార్‌ గెజిటెడ్‌ సంతకం కోసం తాను, తన అమ్మ మూడు రోజులు ఇదే కార్యాలయం చుట్టూ తిరిగామని ఇప్పుడు అదే తహశీల్దార్‌ కార్యాలయంలో సన్మానించబడటం సంతోషంగా ఉందని ఇటీవలే డిప్యూటీ కలెక్టర్‌గా నియామకమైన పరిగి మండలం గోరవనహళ్లికి చెందిన స్వాతి తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్న స్వాతి మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలని పట్టుదలతో గ్రూప్‌ వన్‌ పరీక్షలు రాసింది. అందులోఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా నియామకమైన స్వాతి తన సొంత పనుల్లో భాగంగా పరిగి తహశీల్దార్‌ కార్యాలయానికి గురువారం వచ్చారు. ఈసందర్భంగా స్వాతిని స్థానిక తహశీల్దార్‌ సౌజన్యలక్ష్మి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ సొంత ప్రాంతంలో తనపై ఇంత అభిమానాన్ని చూపించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తాను ఏ ప్రాంతంలో పనిచేసినా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తాను పడిన కష్టం పడిన శ్రమ వృథా కాలేదని విద్యార్థి దశ నుండే ఉన్నతమైన లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే లక్ష్య సాధన సులభతరం అవుతుందని అన్నారు.

➡️