ఎసిబివలలో బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌

ఎసిబివలలో బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌

సబ్‌రిజిస్ట్రార్‌ను విచారిస్తున్న ఎబిసి అధికారులు

బుక్కపట్నం : బుక్కపట్నం సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంపై బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఓ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ శీనానాయక్‌ లంచం తీసుకుంటూ ఉండగా ఆయన్ను పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపిన వివరాల మేరకు… పుట్టపర్తి మండలంకు చెందిన లింగాల సురేందర్‌ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి అన్నదమ్ముల విభాగ దస్తావేజుల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ను ఈ ఏడాది మార్చి నెలలో సంప్రదించాడు. అప్పట్లో ఇందుకోసం లంచం ఇవ్వాలంటూ డాక్యుమెంట్‌ రైటర్‌ శ్రీహరి ద్వారా సబ్‌రిజిస్ట్రార్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 16వ తేదీన శ్రీహరి ద్వారా 50వేల రూపాయలు లంచం రూపంగా ఇస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తానని చెప్పాడు. ఈ విషయంపై లింగాల సురేందర్‌ రెడ్డి మంగళవారం నాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం సాయంత్రం రూ.10 వేలను డాక్యుమెంటరీ శ్రీహరికి ఇచ్చేలా ఎసిబి అధికారులు సూచించారు. ఈ మేరకు శ్రీహరి చేతికి రూ.10 వేలను సురేంధర్‌రెడ్డి ఇస్తుండగా అక్కడే ఉన్న ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. శ్రీహరిని విచారించగా సబ్‌ రిజిస్ట్రార్‌ శీనానాయక్‌ పేరును చెప్పారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ శీనానాయక్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐలు శాంతిలాల్‌, శివ గంగాధర్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️