చలో విజయవాడను విజయవంతం చేయండి

Feb 1,2024 21:15

వినతిపత్రం అందజేస్తున్న ఆశాలు, నాయకులు

                        పుట్టపర్తి రూరల్‌ : ఆశావర్కర్ల న్యాయమైన కోర్కెలు సాధన కోసం ఈనెల 8న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశ వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సౌభాగ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ కోరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీసవేతనం, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సెలవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సంక్షేమ పథకాల సాధన కోసం ఫిబ్రవరి 8న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటి హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవ్స్‌, మెటర్నటీ లీవులు అమలు చేయాలన్నారు. రూ. 10లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని, పనిభారాన్ని తగ్గించాలని, పిహెచ్‌సికి పిలిపించిన ప్రతి సందర్భంలోనూ టిఎ, డిఎలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గోరంట్ల మంజుల, బుక్కపట్నం మంజుల, చెన్నకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️