టిడిపి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై అయోమయం..!

     అనంతపురం ప్రతినిధి : తెలుగేదశం పార్టీలో ఇప్పటికీ పార్లమెంటు స్థానాలపై స్పష్టత రాలేదు. వైసిపి ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇప్పటికీ అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు. ఆన్‌లైన్‌లో నిర్వహించే సర్వేలో మాత్రం అనేక పేర్లు ప్రతి రోజూ వినపడుతూనే ఉన్నాయి. ఇందులో పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించనున్నది తేలక ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం కన్పిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే టిడిపి, వైసిపిలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. వైసిపి 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసింది. ఇందులో అనంతపురం ఎంపీ స్థానానికి కురబ సామాజిక తరగతి నుంచి మాజీ మంత్రి శంకర నారాయణ, హిందూపురానికి బోయ సామాజిక తరగతి నుంచి శాంతమ్మను అభ్యర్థులుగా నిలిపింది. టిడిపి మాత్రం ఇంకా అభ్యర్థులను తేల్చే పనిలోనే ఉంది. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్‌కు జెసి.పవన్‌కుమార్‌రెడ్డిని బరిలో నిలిపింది. హిందూపురానికి నిమ్మల కిష్టప్పను బరిలో నిలిపింది. ఈ రెండు స్థానాల్లోనూ టిడిపి ఓటమి చెందింది. ఈసారి ఎన్నికల్లో ఈ ఇద్దరి పేర్లు ఎక్కడా వినిపించడం లేదు. రెండు స్థానాలనూ బిసిలకే కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం నడుస్తోంది. అనంతపురం పార్లమెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ సర్వేలో బికె.పార్థసారథి, అంబికా లక్ష్మినారాయణ, ప్రొఫెసెర్‌ రాజేష్‌ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరిని అభ్యర్థిగా టిడిపి ప్రకటిస్తుందోనన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఇక హిందూపురం ఎంపీ స్థానానికి సంబంధించి పొత్తుల పంచాయితీ తెగనట్లు కన్పిస్తోంది. పొత్తుల అంశంలో టిడిపి, బిజెపి రెండూ మల్లగుల్లాలు పడుతున్నాయి. మొదట హిందూపురం పార్లమెంట్‌ స్థానం బిజెపికి కేటాయిస్తున్నట్టు ప్రచారం నడిచింది. ఈ మేరకు బిజెపి నాయకులు ఇద్దరు, ముగ్గురు తామే అభ్యర్థులమని ప్రకటించుకున్నారు. తరువాత టిడిపినే ఆ స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. బిజెపి మాత్రం తాము హిందూపురం బరిలో ఉంటామని చెబుతున్నారు. ఈ పొత్తుల వ్యవహారం మూలంగానే ఇప్పటికీ హిందూపురంలో అభ్యర్థులను ప్రకటిచడంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పొత్తులేకపోతే ఎవరు ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థి అన్న దానిపై కూడా చర్చ నడుస్తోంది. మాజీ ఎంపి నిమ్మలకిష్టప్పకు అయితే ఈసారి అవకాశం లేదన్నది స్పష్టమైంది. ఆయన కాకుంటే ఎవరిని టిడిపి ఇక్కడి నుంచి బరిలో నిలుపుతుందన్నది తెలియడం లేదు. వైసిపి ఏమో ఇక్కడ బిసి బోయ సామాజిక తరగతికి చెందిన శాంతమ్మను బళ్లారి నుంచి తెచ్చి పోటీలో పెట్టారు. ఇక్కడ ఆమెకు పోటీనిచ్చేది ఎవరన్నది చూడాల్సి ఉంది. మొత్తంగా టిడిపి పార్లమెంటు అభ్యర్థుల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రొజుకొక పేరు ఆన్‌లైన్‌లో సర్వే పేరుతో వినిపిస్తూనే ఉన్నాయి. ఇవి వచ్చినప్పుడుల్లా ఆ నాయకుల అనుయాయులు మాత్రం ఆనందపడిపోతున్నారు. తమ నాయకుడికి ఖరారైనట్టేనని సంబరపడుతున్నారు. రెండు, మూడు రోజుల్లోనే మరో పేరుతో సర్వేలో విన్పిస్తోంది. ఇందులో ఏది సత్యం, ఎప్పటికి అభ్యర్థులు ఖరారు అవుతుందోనని ఆశావహులు మాత్రం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

➡️