నేటి నుంచి జిల్లాలో కుల గణన సర్వే

Jan 18,2024 21:52

 విడియో కాన్ఫరెన్సులో సమీక్షిస్తున్న జేసీ

                        పుట్టపర్తి అర్బన్‌ : కుల గణన సర్వే కార్యక్రమం శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కులగణన సర్వేపై జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా కుల గణన సర్వే నిర్వహించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 19 నుంచి 28 వరకు పది రోజులపాటు మొబైల్‌ యాప్‌ ద్వారా డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహిస్తామన్నారు. రెవిన్యూ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖ, ప్లానింగ్‌, సంక్షేమ శాఖల నుంచి ఎంపిక చేసిన సూపర్వైజర్లు మండల ప్రత్యేక అధికారులు, డివిజన్‌ జిల్లా అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారన్నారు. సచివాలయం పరిధిలోని ఇంటింటికి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్లి కుల గణన సర్వే నిర్వహిస్తారన్నారు. దీనికోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ సర్వేపై సిబ్బందికి తగిన శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. బలహీన వెనుకబడిన వర్గాల వారికి మరింత మేలు జరగడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ప్రజలందరూ ఇంటింటికి వచ్చే సర్వే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ శివారెడ్డి, సిపిఒ విజరు కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️