పోటీకి దూరంగా సీనియర్లు..!

       అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న నేతలు ఈసారి ఎన్నికలకు దూరంగానే ఉండనున్నట్టు సమాచారం. మాజీ పిసిసి అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి జిల్లా సీనియర్‌ నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. 1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తరువాత 1994లో ఓటమి చెందారు. 1999, 2004లో అక్కడి నుంచే గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మడకశిర ఎస్సీకి రిజర్వు కావడంతో ఆయన కళ్యాణదుర్గంకు మారారు. అక్కడి నుంచి గెలుపొంది మంత్రి అయ్యారు. 2012 రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఆ సమయంలోనూ ఆయన పిసిసి అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అంతేకాకుండా 2014లో పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2019లోనూ కళ్యాణదుర్గం నుంచి మరోమారు పోటీ చేశారు. ఇలా 1989 నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉంటూనే వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిడబ్లుసి సభ్యుడిగా ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇక మరో సీనియర్‌ నాయకుడు జెసి.దివాకర్‌రెడ్డి 2019 ఎన్నికల నుంచే పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా 1983 నుంచి రాజకీయల్లో ఉంటూ వచ్చారు. ఓటమన్నది ఎరుగకుండా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ వచ్చారు. వయోభారంతోపాటు, తన కుమారుడి రాజకీయరంగ ప్రవేశం చేయించాలన్న ఉద్ధేశంతో 2019లో పోటీ చేయలేదు. ఆ తరువాత కొంతకాలం రాజకీయ అంశాలపై మాట్లాడుతూ వచ్చినా గడిచిన రెండేళ్లుగా పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లాలో మరో ముఖ్యమైన నాయకుల్లో డాక్టర్‌ సాకే శైలజనాథ్‌ ఒకరు. 2004లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికలతోపాటు 2009లోనూ శింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. రఘువీరారెడ్డి తరువాత ఆయన పిసిసి బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన శింగనమల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. ఇలా జిల్లాలో ముఖ్యమైన నాయకులుగా చెలామణి అయిన నేతలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

➡️