ప్రజలకు మంచి చేసే పార్టీకి పట్టం కట్టండి

Feb 9,2024 22:33

 వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

                  హిందూపురం : ప్రజలకు మంచి చేసే పార్టీకి పట్టం కట్టాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. పట్టణంలోని శ్రీకంఠపురంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వడ్డెర సంఘం నాయకులు బాలకృష్ణను గజ మాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారం లేకపోయినప్పటికి ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులను తన సొంత నిధులతో చేశానని అన్నారు. వైసిపి వైఫల్యంతోనే ఆపార్టీ నాయకులు టిడిపిలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారన్నారు. వైసిపి నుంచి వచ్చిన వారికి పూర్తిగా భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి చేసింది టిడిపి ప్రభుత్వమే అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కనీస అభివృద్ధి చేయక పోవడంతో ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. 5 సంవత్సరాల వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. నియోజక వర్గంలో కనీస అభివృద్ధి చేపట్టలేదన్నారు. దీంతో ప్రజలకు అవసరమైన వాటిని గుర్తించి తన సొంత నిధులతో అభివృద్ది చేశామన్నారు. వడ్డెరలకు 30శాతం రిజర్వేషన్‌ కల్పించింది టిడిపి ప్రభుత్వమే అన్న విషయం అందరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కుల మతాలకతీతంగా మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, వడ్డెర సంఘం నాయకులు అంజినప్ప, దుర్గా నవీన్‌, కౌన్సిలర్‌ మంజుళ, శ్రీదేవి, పరిమళ, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️