వైసిపి పాలనలో గ్రామపంచాయతీలు నిర్వీర్యం

Dec 6,2023 22:41

 సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట

      కదిరి అర్బన్‌ : వైసిపి పాలనలో గ్రామపంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరిట పట్టణంలోని తాయి గ్రాండ్‌లో నిర్వహించిన సమావేశానికి కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్‌రెడ్డి చరిత్ర హీనుడుగా నిలిచారని విమర్శించారు. సర్పంచుల విధులను నిర్వీర్యం చేసి చీకటి మార్గంలోకి నెట్టిన జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గాండ్లపెంట మండలం కురుమామిడి పంచాయతీకి చెందిన వైసీపీ సానుభూతి పరుడైన సర్పంచి సుధాకర్‌ రెడ్డి వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్పంచులకు అన్యాయం చేసిందన్నారు. సైకో జగన్మోహన్‌ రెడ్డి వల్ల సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పలువురు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి పతనం తప్పదని సర్పంచులు జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం నాయకులు, సర్పంచులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️