193 చెరువులు నింపడమే ధ్యేయం

Jan 19,2024 21:36

పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, తదితరులు

                      నల్లమాడ, పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నల్లమాడ మండలంలోని ఎనుములవారి పల్లెలో నల్లకొండ రిజర్వాయర్‌ కు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించిన దుద్దుకుంట అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు శంకర్‌ నారాయణ, పివి సిద్ధారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసందర్భంగా దుద్దుకుంట మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని రైతుల కళ్లలో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా రూ. 864 కోట్లతో 193 చెరువులో నింపుతున్నామన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నమ్ముతున్నందున ఈ చెరువులు నింపే కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. నాటకాలు బూటకాలు ఆడడం పల్లె రఘునాథరెడ్డికి, చంద్రబాబుకు మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు. చెప్పింది చేయడమే తమ లక్ష్యం అన్నారు. హంద్రీనీవా జలాలను తెచ్చిన ఘనత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు 193 చెరువులు నింపే కల నెరవేరుతోందన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో తొమ్మిది రోజులపాటు 163 గ్రామాలో ఈ పాదయాత్ర కొనసాగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, వైసిపి పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి శాంతమ్మ, ఎంపీపీ సునీత బాయి, పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, వైస్‌ చైర్మన్లు శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న, ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️