అనంత ఎస్పీపై వేటు..!

ఎస్పీ అమిత్‌ బర్దర్‌

       అనంతపురం ప్రతినిధి : ఎన్నికల అనంతరం తాడిపత్రిలో వరుసగా ఘర్షణలు చోటు చేసుకోవడంపై ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు దిగువ స్థాయి అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతంలోనున్న డివిజన్ల స్థాయి అధికారులపైనా చర్యలుండే అవకాశముంది. అల్లర్లను అణచివేయడంలో విఫలమైన అధికారులెవరన్నది తేల్చేందుకు ప్రత్యేకమైన విచారణను చేపట్టేందుకు ఒక కమిటీని నియమించాలని పేర్కొంది. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అధికారుపై ఇటువంటి ఉత్తర్వులివ్వగా ఇందులో అనంతపురం జిల్లా ఎస్పీ కూడా ఉండటం విశేషం. వాస్తవానికి అమిత్‌ బర్దర్‌ ఎన్నికల సంఘం నియామకం మేరకు ఇక్కడికి వచ్చారు. ఎపీఎస్పీ కమాండెంట్‌గానున్న అమిత్‌ బర్దర్‌ను ఎన్నికల నోటిఫికేసన్‌ తరువాత నియమించారు. అంతకు మునుపున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్‌పై ఆరోపణలతో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో అమిత్‌ బర్దర్‌ను ఎన్నికల సంఘం నియమించింది. బాధ్యతలు చేపట్టాక శాంతియుతంగా ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఎక్కడా ఆయనపై రాజకీయపరమైన ఆరోపణలేవి రాలేదు. అయితే ఎన్నికల రోజు తాడిపత్రిలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణను అణచివేయలేక పోయారన్నది ప్రధానమైన అభియోగం. స్వయంగా ఆయనే అక్కడున్నా పరిస్థితి చక్కబడలేదు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడుల్లో ఆయన కూడా గాయపడ్డారు. వరుసగా ఇవి చోటు చేసుకోవడంతో ఇది దేశ వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రికి పక్క జిల్లాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలొచ్చి మరింత రచ్చ చేశాయి. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అనుయాయుడు కిరణ్‌పై పోలీసులే దాడి చేసి తీవ్రగా గాయపరిచారని ఆరోపిస్తున్నారు. ఇందుకు గతంలో పనిచేసి వెళ్లిన డిఎస్పీ చైతన్య కారణమని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ను ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఇక కింది స్థాయి అధికారులెవరేవరన్నది కూడా తేలాల్సి ఉంది. ఇక్కడ డిఎస్పీగా గంగయ్య ఉండగా, సిఐగా మురళీ కృష్ణ ఉన్నారు. ఈ దాడుల్లో మురళీ కృష్ణ తలకు గాయాలయ్యాయి. మరికొంత మందికి గాయాలయ్యాయి. అయితే వీరిలో ఎవరెవరిపై వేటు పడనుందన్నది చూడాల్సి ఉంది. ఎన్నికల సంఘం మాత్రం గట్టిగా హెచ్చరికలు చేస్తూ ఆదేశాలిచ్చింది. బాధ్యతలపై కఠినమైన చర్యలు ఉండాలని, వాటికి సంబంధించిన సమాచారన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కూడా పేర్కొంది. దీంతో దిగువ స్థాయి అధికారుల్లోనూ గుబులు మొదలైంది.

➡️