కూలిన ప్రయివేటు వెంచర్‌ ఆర్చ్‌

 ప్రమాదంలో మరణించిన పురాన్‌ సింగ్‌, ఆశాక్‌

        అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ ప్రయివేటు వెంచర్‌ ఆర్చ్‌ కూలింది. ఈ సమయంలో నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు శిథిలాల కింద పడి మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన ఇద్దరూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సుల్కారిక్‌ గ్రామానికి చెందిన పురాన్‌ సింగ్‌ (21), ఆశాక్‌(22)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన తిహార్‌, అనంతపురం రూరల్‌ మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన నాగరాజు, ఆంజనేయులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కూడేరు మండలం గొటుకూరు జాతీయ రహదారికి ఆనుకుని భవ్యశ్రీ వెంచర్‌ పేరుతో నిర్మాణం జరుగుతోంది. ఇందులో శనివారం నాడు వెంచర్‌ ఆర్చ్‌ కాంక్రీట్‌ పనులను చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు కూలీలుగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సుల్కారిక్‌ గ్రామానికి చెందిన పురాన్‌ సింగ్‌ (21), ఆశాక్‌(22)తో పాటు తీహార్‌, అనంతపురం రూరల్‌ మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన నాగరాజు, ఆంజనేయులు వెళ్లారు. శనివారం సాయంత్రం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆర్చ్‌ పిల్లర్లు విరిగాయి. దీంతో ఆర్చ్‌ కుప్పకూలి కింద పడింది. ఈ శిథిలాల్లో పురాన్‌ సింగ్‌, ఆశాక్‌, తీహార్‌లు కూరుకుపోయారు. నాగరాజు, ఆంజినేయులు పక్కకు పడ్డారు. ఆర్చ్‌ కూలిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జెసిబిల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించగా అప్పటికే సిమెంట్‌ కంకరలో కూరుకుపోయి ఊపిరాడక పురాన్‌ సింగ్‌, ఆశాక్‌లు మరణించారు. తీహార్‌ కాలు విరిగింది. నాగరాజు, ఆంజనేయులుకు గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️