తాడిపత్రిలో సిట్‌ అధికారుల దర్యాప్తు

తాడిపత్రిలో టిడిపి, వైసిపి గ్రూపులు రాళ్లు రువ్వుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిట్‌ అధికారులు

       తాడిపత్రి రూరల్‌ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) శనివారం రాత్రి తాడిపత్రికి చేరుకుంది. సిట్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ జిఎల్‌.శ్రీనివాస్‌లు శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు దర్యాప్తును కొనసాగించారు. శనివారం రాత్రి తాడిపత్రిలో రాళ్ల దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఓంశాంతినగర్‌, పాతకోట, గానుగవీధిలో పర్యటించి, స్థానికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇళ్ల పరిసర ప్రాంతాలనూ పరిశీలించారు. ఇరువర్గాలు గొడవపడ్డ కళాశాల మైదానంలో కలియతిరిగారు. రాళ్లదాడి ఏ విధంగా జరిగిందని ఆరాతీశారు. ఆదివారం ఉదయం పట్టణ పోలీసస్టేషనలో పలు రికార్డులను పరిశీలించారు. డీఐజీ షిమోషీతో సమావేశం అయ్యారు. తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద జరిగిన హింసాత్మక ఘటనలు, పోలీసు అధికారుల వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. అనంతరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. బందోబస్తు సిబ్బందితో మాట్లాడారు. సిట్‌ అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి, వివరాలను నమోదు చేసకున్నారు. వారివెంట తాడిపత్రి రూరల్‌ సిఐ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్‌ఐ గౌస్‌బాషా ఉన్నారు. సిట్‌ అధికారులకు ఎమ్మెల్యే సతీమణి వినతిఎన్నికల పోలింగ్‌ అనంతరం మే 14న జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే నివాసం, కార్యాలయంలో పలు వస్తువులను ధ్వంసం చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి సిట్‌ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులు తమ కార్యాలయంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారన్నారు. ఫర్నిచర్‌ను సైతం విరగొట్టారన్నారు. అక్కడున్న వారిపై అకారణంగా దాడి చేశారని తెలిపారు. వీటిన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్‌ అధికారులను ఆమె కోరారు. తాడిపత్రిలో జరిగిన ఘర్షణలకు టిడిపి నాయకులు చంద్రబాబు, లోకేష్‌ తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తండ్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డి కారణమని దీనిపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షులు ఉమాపతి సిట్‌ అధికారులను కోరారు.

➡️