వెనుకబడిన ప్రాంతానికి ప్యాకేజీ ఏదీ ?

ధర్మవరం సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్‌షా, చంద్రబాబు నాయుడు

       అనంతపురం ప్రతినిధి : బిజెపిలో కీలక నాయకుడైన అమిత్‌ షా జిల్లా పర్యటన అంటే ఏదైనా హామీనిస్తారేమోనని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ప్రధానంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానకి వస్తుండటంతో చేనేతలకు కేంద్ర ద్వారా ఏమైనా హామీ లభిస్తుందని ఆశించారు. సమస్యగానున్న జీఎస్టీ మినహాయంపు అయినా ఇస్తారేమోనని ఎదురు చూశారు. కాని ఆయన ప్రసంగంలో చేనేతల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. చివరకు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జీఎస్టీ మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వమిస్తుందని హామీనిచ్చుకోవాల్సి వచ్చింది. కూటమి పొత్తులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి పోటీ చేస్తోంది. అక్కడ పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సత్యకుమార్‌ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం విచ్చేశారు. ధర్మవరం ప్రచారంలో ఆయనతోపాటు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన రాష్ట్ర నాయకులు చిలకం మధుసూదన్‌రెడ్డి తదతరులు పాల్గొన్నారు. అమిత్‌ షా ప్రచారంలో ఎక్కడా స్థానిక సమస్యల ప్రస్తావన లేదు. చేనేత కార్మికులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల నివారణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది చెప్పలేదు. చేనేత పరిరక్షణకు ఎటువంటి భరోసానిస్తారో చెప్పలేదు. ఇకపోతే వెనుకబడిన అనంతపురం జిల్లాకు విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా ఎటువంటి హామీనివ్వలేదు. పోలవరం, హంద్రీనీవా గురించి మాత్రం మాట్లాడారు. అంతకు మించి జిల్లాకు కేంద్రం ద్వారా చేయబోయే చర్యలేవి లేవు. బిజెపి నుంచి చేనేత హామీ లేవి లేకపోవడంతో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేనేతకు జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అదే విధంగా మరమగ్గాలకు రూ500, చేతి మగ్గాలకు రూ.200 మినహాయంపు ఇస్తామని హామీనిచ్చారు. ఈ సభ అనంతరం చంద్రబాబునాయుడు అనంతపురం నగరంలో జరిగిన సభలోనూ పాల్గొన్నారు. అక్కడా వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టును తీసుకొచ్చి భూములను లాగేసుకునే ప్రయత్నం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. ఆయన భూములు పంచేవాడు కాదని… దోచుకునే వాడని ఎద్దేవా చేశారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. ఒక్క పరిశ్రమ అయినా ఇక్కడికొచ్చిందని ప్రశ్నించారు. వైసిపి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, అనంతపురం అర్బన్‌ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️