బాలయ్యా.. ప్రచారం ఏదయ్యా..!

          హిందూపురం : హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమన్నది లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తర్వాత అతని కుమారుడు హరికృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైసిపి పవనాలు వీచినా హిందూపురం ప్రజలు మాత్రం బాలకృష్ణను గెలిపించారు. ఈసారి బాలకృష్ణ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థి ప్రకటన అయితే జరిగింది గానీ ఆయన పురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మిగితా నియోజకవ్గాల్లో టిడిపి అధిష్టానం అభ్యర్థులను ప్రకటించిన చోట ఓ విడత ప్రచారం ముగించేశారు. హిందూపురంలో మాత్రం ఇప్పటికీ టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులతోనే ప్రచారం చేస్తోంది. బాలకృష్ణ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.

ద్వితీయశ్రేణి నాయత్వంతోనే టిడిపి ప్రచారం

             టిడిపి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నందమూరి బాలకృష్ణను ప్రకటించింది. ఈ ప్రకటన చేసి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా బాలకృష్ణ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల నారా లోకేష్‌ హిందూపురంలో ఓ సభను ఏర్పాటు చేసి ఎన్నికలకు టిడిపి శ్రేణులను సన్నద్ధం చేసి వెళ్లారు. అది మినహా టిడిపి చెప్పకోదగ్గ పెద్ద కార్యక్రమం ఏదీ కూడా చేయలేదు. నారా లోకేష్‌ నిర్వహించిన కార్యక్రమంలో సైతం బాలకృష్ణ పాల్గొనలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాలకష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నియోజకవర్గానికి రాకుండా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసే వారు లేకపోవడంతో టిడిపి శ్రేణుల్లో నిస్తేజం కన్పిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రచారంలోకి వెళ్లిన సమయంలో బాలకృష్ణ ప్రచారానికి రాడా అంటూ ఓటర్ల ప్రశ్నించే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

వైసిపిలో చేరికలు

       హిందూపురం టిడిపి నేతలు గత వారం రోజులుగా వైసిపిలోకి చేరుతున్నారు. చాలా కాలం పాటు టిడిపి కోసం పని చేసిన ముఖ్య నాయకులు సైతం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు హిందూపురం పట్టణం, చిలమత్తూరు మండలంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచే టిడిపి నుంచి వైసిపిలోకి వలసలు పెరిగాయి. చిలమత్తూరు మండలానికి చెందిన చంద్రదండు రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపిపి మరిది అన్సార్‌ ఆహ్మాద్‌తో పాటు మరి కొంత మంది నాయకులు, లేపాక్షి మాజీ ఎంపిపి హనూక్‌లు ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాల ముఖ్య నాయకులు వైసిపిలోకి చేరుతున్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో టిడిపిపై ఉంటుందని ఆ పార్టీ నేతలే బలంగా చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయకపోవడంపై ఆ పార్టీ మద్దతుదారులే పెదవి విరుస్తున్నారు. హిందూపురం గెలుపుపై టిడిపికి అతివిశ్వాసం ఉందనే భావన టిడిపి మద్దతుదారుల నుంచి వ్యక్తం అవుతోంది.

ప్రచారంలో వైసిపి ముందంజ

        హిందూపురం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఆగ్ర నాయకత్వం మొత్తం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. వైసిపి రాయలసీమ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం వైసిపి గెలుపు బాధ్యతను తీసుకుని గత నాలుగు నెలల నుంచి వివిధ రూపాల్లో వైసిపి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. పెద్దిరెడ్డి సారథ్యంలో హిందూపురం వైసిపి అభ్యర్థి దీపిక ప్రచారంలో ముందుకెళ్తోంది. గత మూడు నెలలుగా ప్రజల మధ్యనే ఉంటూ ఆమె ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగం అయ్యారు. దీపిక, ఆమె భర్త వేణురెడ్డి ఇద్దరూ ప్రతి రోజు షెడ్యుల్‌ రూపోందించుకుని చెరొక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో హిందూపురం వైసిపిలో తీవ్ర వర్గ పోరు ఉండేది. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి చాలా వరకు తగ్గింది. ముఖ్య నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు నవీన్‌నిశ్చల్‌ తో పాటు నాయకులందరినీ కలుపుకుని దీపిక ప్రచారం చేస్తున్నారు. ఈసారి బాలకృష్ణను ఓడించి హిందూపురం రాజకీయ చరిత్రను మారుస్తామని వైసిపి శ్రేణులు ధీమాగా ఉన్నారు.

➡️