అనుబంధ ఓటర్ల జాబితా రూపకల్పనలో జాగ్రత్తలు

జిల్లాలో పారదర్శక, దోష రహిత అనుబంధ (సప్లిమెంట్‌) ఓటర్ల జాబితాల రూపకల్పనకు యంత్రాంగం

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో పారదర్శక, దోష రహిత అనుబంధ (సప్లిమెంట్‌) ఓటర్ల జాబితాల రూపకల్పనకు యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. అనుబంధ ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులు, రానున్న 2024 ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లతో బుధవారం జెసి ఎం.నవీన్‌తో కలిసి 35వ వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గడిచిన వారం రోజుల్లో మార్పులు, చేర్పులు కోరుతూ 2715 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతివారమూ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో పోలింగ్‌ శాతం కనీసం 75 శాతం మించి ఉండాలనే లక్ష్యంతో ఓటర్లను అవగాహన కలిగించే స్వీప్‌ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. 80 ఏళ్లు వయస్సు పైబడిన, అలాగే నడవలేని, మంచం పట్టి ఉన్న వారు, వికలాంగుల ఓటర్లకు సంబంధించి ఇంటి దగ్గరే ఓటింగ్‌ నిర్వహణపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఇలా జిల్లా మొత్తం 49,957 మంది ఓటర్లను గుర్తించామన్నారు. వీరు ఇంటి నుంచే ఓటు వేసేందుకుగాను ముందుగా ఫారం-12 డి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం, తదితర పంపిణీ చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు ప్రత్యేకంగా 18004256625 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె.బాబు, బిజెపి నుంచి సురేష్‌బాబు సింగ్‌, సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కూర్మారావు పాల్గొన్నారు.

 

➡️