అరాచకం తప్ప అభివృద్ధి లేదు

నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో

టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతతో మొదలైన అరాచకం, విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. మరో మూడు నెలల్లో ఓటు ద్వారా ప్రజలు వాటికి చరమగీతం పాడనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, సాగునీటి కాలువలకు కనీస మరమ్మతులు చేపట్టకుండా సాగునీరందని స్థితిని కల్పించారని ధ్వజమెత్తారు. రివర్స్‌ టెండరింగ్‌తో రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వైసిపి నాయకులు దళారులుగా అవతారమెత్తి రైతులను దోచుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ రద్దు చేయకుండా, కనీసం ఒకటో తేదీకైనా జీతాలను సక్రమంగా చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్‌ విశ్వసనీయతను కోల్పోయారని, ఎమ్మెల్యేలందరినీ మార్చినా వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రజలు జగన్‌ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

➡️