ఆ దమ్ము లోకేష్‌కు ఉందా?

మీకు మంచి జరిగితేనే ఓటు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • అభివృద్ధిపై చర్చకు సిద్ధం
  • రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి – పలాస

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని, అలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గలోని ప్రగతి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్‌, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకురాకుండా ఉత్తరాంధ్రను వలసల అంధ్రాగా మార్చారని విమర్శించారు. శంఖారావం పేరుతో లోకేష్‌ చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు. చేసిన అభివృద్ధిని లేక మైకు దొరికితే తండ్రీ కొడుకులు జగన్‌ను, వైసిపి నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ హయాంలో ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు, వంశధార ఫేజ్‌-2, నదుల అనుసంధానం ఇతర అభివృద్ధి పనులతో ఉత్తరాంధ్రలో వలసల నివారణకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్‌ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. 1.43 లక్షల అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఉద్యోగాల కల్పన గురించి లోకేష్‌ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధిపై నిర్మాణాత్మక చర్చకు తాను సిద్ధమన్నారు. ఎక్కడకు రమ్మన్నా వస్తానని, లోకేష్‌ ఎదురుగా కూర్చొని ఆయనకు తెలీని విషయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనను కొండలరాజు అంటున్నారని, ఆ కొండల దగ్గరకు చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. రూ.606 కోట్ల అక్రమాస్తులు తనకు ఉన్నాయని చెప్తున్నారని, గౌతు కుటుంబీకులు బినామీలుగా ఉన్న వాటిని పంచేందుకు తాను సిద్ధపడుతున్నానని చెప్పారు.

➡️