ఎకరాకు రూ.45 లక్షలు ఇవ్వాలి

మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా నౌపడ రైల్వే

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

ప్రజాశక్తి – టెక్కలి

మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా నౌపడ రైల్వే జంక్షన్‌ నుంచి మూలపేట గ్రామ రోడ్డు వరకు రైల్వే లైను ఏర్పాటుకు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు రూ.45 లక్షల పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సంతబొమ్మాళి మండలం కాశీపురం, కోటపాడుకు చెందిన 30 మంది రైతులతో సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పోర్టు నిర్మాణంలో భాగంగా సరుకుల ఎగుమతులు, దిగుమతుల నిమిత్తం రైల్వే నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకు గానూ కాశీపురం, కోటపాడుకు చెందిన 30 మంది రైతుల నుంచి 16 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.13 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు చెల్లించనునట్లు చెప్పారు. దీనిపై రైతులు స్పందిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధర తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏటా రెండు పంటలు పండించే భూములను అప్పగించడమే తమకు ఇష్టం లేదన్నారు. అభివృద్ధి దృష్ట్యా అయిష్టంగానైనా భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతుంటే, తక్కువ ధర చెప్పడం సరికాదన్నారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో సంతబొమ్మాళి తహశీల్దార్‌ చలమయ్య, ఎల్‌.ఎల్‌.నాయుడు కోత చిన్నబాబు, కె.మధుసూదనరావు, కోత సతీష్‌, పూడి చంద్రమౌళి, అట్టాడ సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️