కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలి

రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరిద్ధరించాలని లేకుంటే పోరాటాలు

దీక్ష చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

నరసన్నపేట:

రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరిద్ధరించాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎం. ఆదినారాయణమూర్తి, నరసన్నపేట నియోజకవర్గ కార్యదర్శి తర్ల లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం పాత బస్టాండ్‌ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం వెంటనే పునరుద్ధరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్మాణ యజమానులు చెల్లించే సంక్షేమ నిధిని కార్మికుల సంక్షేమ పథకాలు కోసమే ఖర్చు చేయాలని, పెండింగ్‌ క్లైయిమ్‌లు పరిష్కరించాలని కోరుతూ 2వ రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సుమారు లక్షమంది నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ చట్టం అమలును గత సెప్టెంబర్‌ 2020లో మెమో 1214 జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని విమర్శించారు. ఫలితంగా జిల్లాలో సుమారు 8 వేల కార్మికుల క్లెయిమ్‌లు అపరిష్కతం గా ఉండిపోయాయని అన్నారు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ఇతర అవసరాలకు సెస్‌ నిధిని మళ్లించడం దుర్మార్గమైన చర్యన్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో నిర్మాణ కార్మికులు చేతి నిండా పని లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు వెంటనే చెల్లించాలని, నిర్మాణ యజమాని నుంచి వసూలు చేసిన సెస్‌ నిధులను ఇతర అవసరాలకు మళ్లించరాదని డిమాండ్‌ చేశారు. నిరాహార దీక్షలో సిమ్మ ఉమా, పైల రాము, వాన అప్పారావు, బోర సూర్యనారాయణ, కామేశ్వరి, ఎల్‌. గణమ్మ, ఆర్‌.తవుడు, రాజారావు, సింహాచలం పాల్గొన్నారు.

 

➡️