జల జీవన్‌ మిషన్‌ పనులు వేగవంతం

ప్రతి గడపకూ స్వచ్ఛమైన తాగునీరు

సమీక్షిస్తున్న స్పీకర్‌ సీతారాం

  • శాసనసభ స్పీకర్‌ సీతారాం

ఆమదాలవలస : ప్రతి గడపకూ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్పీకర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జలజీవన్‌ మిషన్‌ పనులపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, నీరు, సంపూర్ణ పోషకాహారం ప్రతి ఒక్కరికీ కల్పించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సంకల్పమని అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు కల్పనే లక్ష్యంగా, జల జీవన్‌ మిషన్‌ పథకం కార్యక్రమం అమలుకు సిఎం ఆమోదం తెలిపారని అన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ దాదాపుగా పనులకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు పూర్తయిన వాటిని ప్రారంభించామన్నారు. ఎన్ని గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయో సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ధేశిత సమయానికి పనులు పూర్తి కావాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారుల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని అన్నారు. నత్తనడకన పనులు చేపట్టే కాంట్రాక్టర్లు పనులు వేగవంతం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు ప్రారంభిం చిన పనులు శత శాతం ఎప్పటికీ పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందేనని అన్నారు. పొందూరు మండలానికి నాగావళి నది నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి శుద్ధి చేసిన జలాన్ని ప్రతి ఇంటికీ అందించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఇ టి.శ్రీనివాస్‌ప్రసాద్‌, డిఇ లలితకుమారి, నాలుగు మండలాల ఎఇలు పాల్గొన్నారు.

 

➡️