జీడికి గిట్టుబాటు ధర ప్రకటించాలి

80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల గిట్టుబాటు

సమావేశంలో మాట్లాడుతున్న తులసీదాస్‌

  • ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
  • కరువు జిల్లాగా ప్రకటించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల గిట్టుబాటు ధర ప్రకటించి, రైతుభరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పలాస పర్యటనలో ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షాన ఉంటుందా? దళారుల పక్షాన ఉంటుందో తెలపాలన్నారు. మద్దతు ధర కోసం జీడి రైతులు గతేడాది నుంచి పలురూపాల్లో పోరాటాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నేరడి బ్యారేజీ నిర్మించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం చేయాలన్నారు. వంశధార కాలువ మరమ్మతులు చేసి షట్టర్లు బిగించి శివారు భూములకు నీరు అందించాలని, ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. వంశధార నదిలో మన వాటా నీటిని ఉపయోగించుకుంటే జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. జిల్లా కరువు బారిన పడదని, వలసలను నివారించవచ్చని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. రిమ్స్‌ హాస్పిటల్‌లో సూపర్‌ స్పెషాల్టీ వైద్యం అందక ప్రమాదాలు సంభవిస్తే నేటికీ విశాఖపట్నం తరలించాల్సి వస్తుందన్నారు. రిమ్స్‌ని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ప్రమోట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలో చిన్న వర్షం కురిసినా నదిలా మారిపోతుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలన్నారు. జిల్లాలో వంద పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలని, కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విశ్వసముద్ర సంస్థకు ఇచ్చిన మైనింగ్‌ లీజును రద్దు చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

 

➡️