దళిత మహిళపై దాడి అమానుషం

పోలాకి మండలం చీడివలసకు చెందిన దళిత మహిళ కాయ పార్వతిపై పెత్తందారుల దాడి అనుమానుషమని

పరామర్శిస్తున్న కెవిపిఎస్‌, వ్య.కా.స నాయకులు

  • నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
  • కెవిపిఎస్‌, వ్య.కా.స నాయకుల డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పోలాకి మండలం చీడివలసకు చెందిన దళిత మహిళ కాయ పార్వతిపై పెత్తందారుల దాడి అనుమానుషమని కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు భవిరి కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరమ్మ ఖండించారు. ఆమెపై దాడి చేసిన ఆ గ్రామ పెత్తందారులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతిని గురువారం పరామర్శించి, దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీడివలసకు చెందిన అగ్ర కుల పెత్తందారుడైన చెక్క సింహాచలం కుమార్తె, తన కుమారుడు కాయ ఇసాక్‌ ప్రేమించుకున్నారని పార్వతి తెలిపారు. వారు కనిపించకపోవడంతో పెత్తందారులు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా పెత్తందారులు మూకుమ్మడిగా మారణాయుధాలతో తనపై దాడి చేశారని చెప్పారు. పెట్రోల్‌ పోసి తగులబెట్టాలని ప్రయత్నించారని తెలిపారు. దీనిపై నాయకులు స్పందిస్తూ దాడి చేసిన పెత్తందారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర కార్యదర్శి రాకోటి చిన్నారావు, మామిడి సూర్యనారాయణ, కె.శ్రీను, కాయ దుర్గారావు, వై.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️