పనసతో పసందు

ఉత్తర భారతంతో పోలిస్తే
  • ఉద్దానంలో అధిక దిగుబడి
  • ఆదాయంతో పాటు ఆరోగ్యం

జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్నా ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా, 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్‌, కటక్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు. అయితే ఉద్దానం ప్రాంతంలో అంతరపంటగా సాగుచేస్తున్న ఈ పనస రైతులకు అటు ఆర్థికంగా ఉతమందిస్తుండడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనసతో లాభాలు ఒకసారి పరిశీలిస్తే…

ప్రజాశక్తి- కవిటి

ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాన పనసను ఎక్కువగా పండిస్తున్నారు. అందుకే ఇక్కడ వినియోగమూ ఎక్కువే. ఒక్క కేరళలోనే వంద రకాల పనస చెట్లు పెరుగుతున్నాయి. పనసతో కూరలు, వేపుళ్లు, చిప్స్‌, అప్పడాలు, స్వీట్లు మామూలే. అయితే బెంగుళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ రీసర్చ్‌ ఇటీవల జాక్‌ఫ్రూట్‌ జ్యూస్‌, చాక్లెట్లు, బిస్కెట్లను తయారు చేసింది. మూడేళ్ల పరిశోధనల తరవాత పనస గుజ్జుతో జ్యూస్‌ను ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. ఇందులో చక్కెర, నిల్వ పదార్థాలు వాడలేదు. అయినా ఆరు నెలల వరకూ చెడిపోకుండా ఉంటుందని, శీతల పానీయాలకు బదులుగా ఈ జ్యూస్‌ తాగడం ఆరోగ్యానికి మేలని సంస్థ ప్రకటించడం విశేషం. గోధుమ పిండి, పనస గింజల పిండి, కొకోవాతో చాకొలెట్‌లు, బిస్కెట్లను కూడా తయారు చేస్తున్నారు.

వరి, గోధుమల కంటే మేలు..

పనస ఎక్కువగా పండే కేరళ, గోవా, కర్నాటక, ఆంధ్రా లాంటి రాష్ట్రాల్లో కొంతమంది ఔత్సాహికులు సంప్రదాయ వంటలకు మారుగా పనసతో అనేక ప్రయోగాలు చేస్తున్నారు., జాక్‌ఫ్రూట్‌ బర్గర్లు, గలౌటీ కబాబ్స్‌, మసాలా దోశ, బిర్యానీలను వండేస్తున్నారు. ఈ కోవలోకే వచ్చేది జాక్‌ఫ్రూట్‌ 365. పనస కాయతో చేసిన పిండి ఇది. పనస గ్ల్లైసెమిక్‌ ఇండెక్స్‌ వరి, గోధుమల కన్నా నలభై శాతం తక్కువ. కాబట్టి మధుమేహుల ఆరోగ్యానికి మంచిది. పనస పిండిని వంటల్లో వాడడం వల్ల రక్తపోటు, సుగరు నియంత్రణలో ఉంటాయి. మార్కెట్లో ఈ మధ్యే వచ్చాయి జాకోబైట్‌. పనస తొనల్ని ఫ్రీజర్‌లో పెట్టి గడ్డకట్టేలా చేస్తారు. ఇవి మూడు నెలల వరకు చెడిపోవు. ఇలా పనసను కూడా మామిడి, ద్రాక్షలాగ విరివిగా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

వంద గ్రాముల పనసలో…

కెలోరీలు- 94కొవ్వు-0.3 గ్రాములుపీచు పదార్థాలు- 2 గ్రాములు ప్రొటీన్లు- గ్రాము పొటాషియం- 303 మిల్లీ గ్రాములుకాల్షియం-34 మిల్లీ గ్రాములుకార్బోహైడ్రేట్స్‌- 24 గ్రాములుఫొలేట్‌- 14 మైక్రో గ్రాములుఐరన్‌- 0.6 మిల్లీగ్రాములు

పనస బిర్యానీకి డిమాండ్‌

కరోనా కారణంగా మన జీవన విధానం పూర్తిగా మారింది. ఈ గడ్డు కాలంలో పనసకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా మాంసాన్ని తినడానికి చాలా మంది భయపడతారు. వాళ్లందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పనస. దీంతో చికెన్‌, మటన్‌ కన్నా కూడా పనస బిర్యానీ అధిక ధరకు అమ్ముడవుతోంది. బెంగాల్‌లో పనసను ‘గాచ్‌ పతా’ గా పిలుస్తారు. అంటే గొర్రె చెట్టు అని అర్ధం. కాయపనస ముక్కలు, తొనలు మటన్‌లా ఉండడం వల్ల ఆ పేరు స్థిరపడిందేమో. అందుకే ప్రత్యేక రోజుల్లో పనన వంటలను వండుతుంటారు. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి కలిపి వండిన పనస కూర అందించే రుచిని వర్ణించలేం అంటారు బెంగాలీలు. ఇక బిహార్‌లో ‘కాలా మటన్‌ కర్రీ’ తరహాలో పనసకు సుగంధ ద్రవ్యాల్ని కలిపి తక్కువ మంటమీద ఉడికించి చేస్తారు. బిహార్‌లో జాక్‌ఫ్రూట్‌ కట్లెట్స్‌ చాలా ఫేమస్‌. ఇక ఆంధ్రా స్టెయిల్‌ పనస పొట్టు ఆవ కూర ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది. దాంతో పాటు పనస కూర, గింజల వేపుడు, పనస పొట్టు బిర్యానీ, పనస కాయ బిర్యానీ కూడా ఇక్కడి ప్రత్యేక రుచులుగా చెప్పాలి. గోవాలో కొన్ని వంటకాల్లో చేపకు బదులుగా పనసను వాడడం విశేషం.

నాణ్యతలో మేటి

ఉద్దానంలో సాగుచేస్తున్న పనస మిగతా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వాటికంటే శ్రేష్ఠమైనవి. నాణ్యత, పరిమాణంలో ఈ ప్రాంతంలో పండిన పండుకు మిగతావి సాటిరావు. ఎందుకంటే ఇక్కడ అంతా సేంద్రీయమే. ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడరు. ముఖ్యంగా ఉద్దానం రైతులకు పనస ఒక వర ప్రదాయిని. తక్కువ పెట్టుబడితో ఆదాయం వచ్చే పంట పనస. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఉద్దానం పనసకు ఎప్పటికీ డిమాండ్‌ తగ్గదు.

– పి.మాధవీలత, ఉద్యానశాఖ అధికారి, కవిటి

➡️